- బ్యాంక్ అకౌంట్లు అప్పగించిన నలుగురు అరెస్ట్
- సైబర్ ఫ్రాడ్ లావాదేవీలను గుర్తించి.. నిందితులను అరెస్ట్ చేసిన టీజీ సీఎస్‌బీ
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లకు కరెంట్ బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. కరెంట్ ఖాతాలను ఓపెన్ చేసి దుబాయ్, కేరళకు చెందిన సైబర్ క్రైమ్ ఏజెంట్లకు అప్పగిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీ సీఎస్‌బీ) అధికారులు అరెస్ట్ చేశారు. టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ అల్మాస్‌గూడకు చెందిన అవుల శ్రీనివాస్ (45) దుబాయ్‌లో ‘ఎన్‌సీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్’ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి దివాళా తీశాడు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సైబర్ మోసాలకు అవసరమైన కరెంట్ బ్యాంక్ అకౌంట్లు సప్లయ్ చేస్తే భారీగా సంపాదించవచ్చని, కరెంట్ ఖాతాల్లో డిపాజిట్ అయ్యే డబ్బులో 25 శాతం కమీషన్ ఇస్తామని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో శ్రీనివాస్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండియాకు వచ్చాడు. మహబూబాబాద్‌లో సాయి తేజా కన్సెల్టెన్సీ నిర్వాహకుడు కుక్కల సతీశ్ కుమార్(41)కు విషయం చెప్పాడు.
సతీష్ కుమార్ వరంగల్‌కు చెందిన తన స్నేహితుడు రాజేందర్‌ను.. రాజేందర్ తన స్నేహితుడైన కరీంనగర్‌కు చెందిన అబ్రాడ్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు వట్టి మైఖేల్ రెడ్డిని సంప్రదించాడు. దీంతో మైఖేల్‌రెడ్డి తనీష్ కన్సల్టెన్సీ పేరుతో కరీంనగర్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి, ఆ వివరాలను కేరళకు చెందిన వ్యక్తులకు అందించారు. బ్యాంక్ అకౌంట్‌తో లింకైన మైఖేల్‌రెడ్డి మొబైల్ ఫోన్‌ను అప్పగించారు. అనంతరం రూ.2.5 లక్షల కమీషన్ రాగా.. ఆవుల శ్రీనివాస్, సతీశ్, రాజేందర్, మైఖేల్ రెడ్డిఆ నలుగురు పంచుకున్నారు.
ఇలా దొరికిపోయారు..
ఎల్బీ నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫోన్ నంబర్‌ను ఆగస్ట్ 20న గుర్తుతెలియని వ్యక్తులు 305 స్టాక్ మార్కెట్ న్యూస్ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. అదే గ్రూప్‌లో ఓ మహిళ ఫొటోతో నేరగాళ్లు అతనికి వల వేశారు. సెప్టెంబర్ 23న ఎన్‌యూవీఏఎమ్‌ఏ పేరుతో లింక్ పంపించి.. ట్రేడింగ్ చేయాలని కోరారు. మొదట రూ.50 వేలు డిపాజిట్ చేయించి, 4.69 శాతం లాభం వచ్చినట్లు చూపారు. ఇలా 50 రోజుల్లో రూ.3,49 కోట్లు వసూలు చేసి.. రూ.28.52 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్లుగా వర్చువల్ అకౌంట్‌లో బ్యాలెన్స్ చూపారు.
కానీ, డబ్బును విత్ డ్రా కాకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు నవంబర్17న టీజీ సీఎస్‌బీకి ఫిర్యాదు చేశాడు. బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన డబ్బు కరీంనగర్ యాక్సిస్ బ్యాంకులోని తనీష్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పేరున ఉన్న కరెంట్ అకౌంట్‌లో డిపాజిట్ అయినట్లు సీఎస్‌బీ పోలీసులు గుర్తించారు. అనంతరం అకౌంట్ ఓపెన్ చేసిన మైఖేల్ రెడ్డి సహా నలుగురిని అరెస్ట్ చేశారు.
