దుప్పుల వేట కేసులో మాజీ ఎమ్మెల్యే కొడుకు.. సత్తుపల్లి నీలాద్రి పార్క్‌‌‌‌లో దుప్పుల వేట కేసులో నలుగురు అరెస్ట్‌‌‌‌

దుప్పుల వేట కేసులో మాజీ ఎమ్మెల్యే కొడుకు..  సత్తుపల్లి నీలాద్రి పార్క్‌‌‌‌లో దుప్పుల వేట కేసులో నలుగురు అరెస్ట్‌‌‌‌
  •   ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దత్తపుత్రుడు రఘు
  •   దుప్పి మాంసంతో పెండ్లి విందు ఇచ్చినట్లు ఆరోపణలు
  •   వివరాలు వెల్లడించిన ఖమ్మం జిల్లా ఫారెస్ట్‌‌‌‌  ఆఫీసర్‌‌‌‌ సిద్ధార్థ్‌‌‌‌ విక్రమ్‌‌‌‌ సింగ్‌‌‌‌ 

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నీలాద్రి అర్బన్‌ పార్క్ లో జింకలను వేటాడిన కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసు కుని రిమాండ్ కు తరలించారు. కేసులో ప్రధాన నిందితుడు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దత్తపుత్రుడు మెచ్చా రఘు.  కాగా..  అర్బన్‌ పార్క్​  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సహకారంతోనే జింకలను వేటాడినట్లు పోలీసులు గుర్తించారు.  కేసు వివరాలను ఖమ్మం జిల్లా ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌ శనివారం మీడియాకు తెలిపారు.  

పెండ్లి విందు కోసం జింకల వేట..

సత్తుపల్లి టౌన్ కు ఆనుకొని సుమారు 350 ఎకరాల్లో నీలాద్రి అర్బన్‌ పార్క్‌ ఉంది. ఇందులో 50కి పైగా చుక్కల జింకలు ఉన్నాయి. భద్రాద్రి  జిల్లా దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెంకు చెందిన మెచ్చా రఘు పెండ్లి ఇటీవల సత్తుపల్లిలో జరిగింది. కాగా.. గత నెల 24న అర్బన్‌ పార్క్‌ లో ఐదు చుక్కల జింకలను వేటాడి పెండ్లి విందు ఇచ్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. స్పందించిన ఫారెస్ట్‌ ఆఫీసర్లు అదే నెల 29న టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌తో దర్యాప్తు చేపట్టారు. అర్బన్‌ పార్క్‌ వాచర్‌ గోపీకృష్ణ, వాకర్ శ్రీరాంప్రసాద్‌ పాత్ర ఉన్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకొని విచారించగా మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. 

ఇద్దరు వ్యక్తులు స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో గన్‌తో పార్క్‌ లోకి వెళ్లినట్టు సమీపంలోని కిరాణ షాప్‌లో వద్ద సీసీ కెమెరాలో రికార్డైంది. పార్క్‌ లోని సీసీ కెమెరాలను గోపీకృష్ణ ఆఫ్‌ చేసి కారును లోపలికి వెళ్లేలా చేశారని తేలింది. దీంతో నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ రోహిత్‌ రాజ్‌, ఖమ్మం సీపీ సునీల్‌దత్‌కు సమాచారం ఇచ్చారు.  విచారణ చేసి ప్రధాన నిందితులుగా మెచ్చా రఘు, కుంజా భరత్‌గా నిర్ధారించారు. దీంతో శుక్రవారం భరత్‌ను అదుపులోకి తీసుకోగా.. రఘు అదేరోజు సాయంత్రం ఖమ్మం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 

స్పోర్ట్స్‌ కోటాలో గన్‌ లైసెన్స్‌

మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు పిల్లలు లేకపోవడంతో సోదరుడి కొడుకు రఘును దత్తత తీసుకున్నారు. ఇతనికి స్పోర్ట్స్​కోటాలో గన్‌ లైసెన్స్‌ ఉంది. రెండు లైసెన్డ్స్‌ గన్‌లు ఉండగా.. ఒకటి డబుల్‌ బేరల్‌, మరొకటి సింగిల్ బేరల్‌ గన్‌. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డబుల్‌ బేరల్‌ గన్‌ను దమ్మపేట పోలీసులకు అప్పగించిన రఘు.. సింగిల్‌ బేరల్‌ గన్‌ను తన వద్దే ఉంచుకుని..  దుప్పులను వేటాడిన తర్వాత  పోలీసులకు అప్పగించాడు. అయితే వేటాడిన జింకల మాంసంతో  విందు ఏర్పాటు చేశారనేది మాత్రం నిర్ధారణ కాలేదని ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌ తెలిపారు. గన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తున్నామని,  రఘును విచారించిన తర్వాత పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు.