హైదరాబాద్ లోని ఐడీఏ బొల్లారంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ఎస్పీ కాలనీలోని ఓ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. వేగంగా మంటలు వ్యాపించడంతో బిల్డింగ్ లో నివాసం ఉంటున్న 16 కుటుంబాలు ప్రాణభయంతో బయటికి పరుగులు తీసారు. ఈ ఘటనలో నాలుగు బైకులు పూర్తిగా దగ్దమైనట్లు తెలుస్తోంది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి ఉండచ్చని భావిస్తున్నారు. బిల్డింగ్ లోని ఒక గదిలో నివసిస్తున్న పేద కుటుంబానికి చెందిన ఇంట్లో సామాను మొత్తం మంటలకు ఆహుతైపోయి తీవ్ర నష్టం వాటిల్లింది.అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన పేదలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
