
పంట నష్టపోయి అప్పులపాలై రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పత్తి, వరి పంట దెబ్బతిని కరీంనగర్ జిల్లాలో వేల్ముల కుమార్(34), పంట పెట్టుబడికి ఆరు లక్షలు అప్పు కావడంతో భూపాలపల్లి జిల్లాలో యువరైతు అశోక్ (35) పురుగుల మందు తాగారు. రుణమాఫీ లిస్ట్‌లో పేరు లేకపోవడంతో మహబూబ్‌నగర్ జిల్లా బలీదుపల్లికి చెందిన శ్రీను (51) కలుపుమందు తాగాడు. పత్తి వేసి అప్పుల పాలై అశ్వారావుపేట మండలం వడ్డే రంగాపురం రైతు డేరంగుల సింగరాజు (25) ప్రాణాలు తీసుకున్నాడు.
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రైతన్నల బలవన్మరణం
అశ్వారావుపేట, అడ్డాకుల, మొగుళ్లపల్లి(టేకుమట్ల), రామడుగు, వెలుగు: అప్పుల బాధతో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు రైతులు ఆదివారం సూసైడ్ చేసుకున్నారు. అశ్వారావుపేట మండలం వడ్డే రంగాపురం గ్రామానికి చెందిన డేరంగుల సింగరాజు (25) 8 ఎకరాల భూమిని గత మూడు సంవత్సరాలుగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో పంట దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అయినా ఈ ఏడాది పత్తి పంటను వేశాడు. పెట్టుబడి కోసం ఎవరిని అడిగినా ఇవ్వకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పురుగుల మందుతాగి యువరైతు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండ లంలో యువరైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గరిమిళ్ళపల్లి గ్రామ శివారులోని కలికోటపల్లికి చెందిన యువరైతు కొలాని అశోక్ (35) గత మూడు ఏండ్లుగా తనకున్న ఎకరం భూమితో పాటు మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకొన్నాడు. వరి, పత్తి, వేరుశనగ పంటలు సాగు చేస్తున్నాడు. ఈ పంటల పెట్టుబడికి, కౌలు కోసం దాదాపుగా రూ.6 లక్షల వరకు అప్పులు చేశాడు. పంటలు సరిగ్గా పండకపోవడంతో తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. మనస్తాపంతో అశోక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల సివిల్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించగా శనివారం అర్ధరాత్రి చనిపోయాడు.
వడగండ్ల వానకు పంటనష్టంతో..
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని దేశ్రాజుపల్లి గ్రామానికి చెందిన వేల్ముల కుమార్(34) అప్పుల బాధ భరించలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమార్ తనకు ఉన్న రెండు ఎకరాల భూమితో పాటు మరో నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి, పత్తి పంట సాగు చేశాడు. ఈ యాసంగిలో వడగండ్ల వానకు పంట నష్టంతో ఆర్థికంగా నష్టపోయాడు. రెండు సంవత్సరాల క్రితం అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేపట్టడంతో రూ.7లక్షల వరకు అప్పులు అయ్యాయి. వర్షాకాలంలో కూడా కురిసిన వర్షాలకు పంట కొట్టుకపోయి నష్టం జరిగింది. అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతూ ఈ నెల 1వ తేదీ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అతని భార్య, కుటుంబ సభ్యుల సహాయంతో 108 అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ కుమార్ చనిపోయాడు.
రుణమాఫీ లిస్ట్‌లో పేరు లేకపోవడంతో..
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామానికి చెందిన శ్రీను(51) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లిస్ట్‌లో పేరు లేకపోవడంతో బ్యాంకులో రూ.80 వేల అప్పు అలాగే ఉంది. గత ఏడాది అప్పు చేసి రెండు ఎద్దులు తెచ్చుకోగా అవి చనిపోయాయి. ఈ ఖరీఫ్‌లో మూడెకరాల్లో వరి, పత్తి సాగు చేయగా వర్షం లేక పంటలు ఎండిపోయాయి. పంటల సాగు కోసం రూ.3లక్షల పెట్టుబడి పెట్టాడు. ఇలా రూ.6 లక్షలకు పైగా అప్పులు కావడంతో మనస్తాపం చెంది ఈ నెల 1న ఇంట్లో కలుపుమందు తాగాడు. గమనించిన భార్య, కొడుకు జిల్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. శ్రీను కుటుంబాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.