
గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జూరాల ఎగువన క్యాచ్ మెంట్ ఏరియా నుంచి వరద రావడం, కర్నాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి 75 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉండడంతో గురువారం నాలుగు గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర 318.516 మీటర్ల లెవెల్ మెయింటెన్ చేస్తున్నారు. జూరాలకు 40 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, నాలుగు గేట్ల ద్వారా 15,516 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కోసం 34,422 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 1,500 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్-–1కు 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 315 క్యూసెక్కులతో కలిపి జూరాల ప్రాజెక్టు నుంచి 52,468 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.