టెర్రరిస్టులతో పోరాడుతూ అమరులైన నలుగురు సోల్జర్లు

టెర్రరిస్టులతో పోరాడుతూ అమరులైన నలుగురు సోల్జర్లు
  • జమ్మూకాశ్మీర్​లోని దోడా జిల్లా​లో విషాదం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లోని దోడా జిల్లాలో టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. చనిపోయిన వారిలో కెప్టెన్ ర్యాంకు అధికారి కూడా ఉన్నారని ఆర్మీ ఆఫీసర్లు తెలిపారు. సోమవారం రాత్రి ఈ ఎన్​కౌంటర్ జరిగింది. టెర్రరిస్టుల కాల్పుల్లో అమరులైన వారిని కెప్టెన్ బ్రిజేశ్ థాపా, జవాన్ నాయక్ డీ.రాజేశ్, కానిస్టేబుళ్లు బిజేంద్ర, అజయ్​గా గుర్తించారు. మరికొంత మంది జవాన్లు, పోలీసులు గాయపడ్డారని తెలిపారు. కాల్పుల తర్వాత టెర్రరిస్టులు అక్కడి నుంచి పారిపోయారని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు వివరించారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదన్నారు.

20 నిమిషాల పాటు ఫైరింగ్

దెస్సా జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సమాచారం అందింది. దీంతో రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, కాశ్మీర్ పోలీసులు కలిసి జాయింట్ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భద్రతా బలగాలు రాత్రి 9 గంటల ప్రాంతంలో దోడా టౌన్​కు 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న దెస్సా ఫారెస్ట్ ఏరియాలోని ధరిగోటే ఉరర్ బాగి వద్దకు చేరుకున్నారు. జవాన్ల రాకను గుర్తించిన టెర్రరిస్టులు.. వారిపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపారు. 

సుమారు 20 నిమిషాల పాటు ఫైరింగ్ జరిగింది. తర్వాత టెర్రరిస్టులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. కెప్టెన్ బ్రిజేశ్ థాపా నేతృత్వంలోని బలగాలు వారిని వెంబడించాయి. మళ్లీ టెర్రరిస్టులు, బలగాల మధ్య కాల్పులు జరగ్గా.. ఐదుగురు సోల్జర్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కెప్టెన్ బ్రిజేశ్ థాపా, జవాన్ నాయక్ డీ.రాజేశ్, కానిస్టేబుళ్లు బిజేంద్ర, అజయ్ వీరమరణం పొందారు.

రంగంలోకి పారా కమాండోలు

ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు దేశం రుణపడి ఉంటుందని పలువురు ఆర్మీ సీనియర్ అధికారులు తెలిపారు. ఫారెస్ట్ ఏరియాలో మరిన్ని బలగాలను రంగంలోకి దించి టెర్రరిస్టుల కోసం దెస్సా ఫారెస్ట్ ఏరియాను జల్లెడపడుతున్నట్లు చెప్పారు. 

డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నామని తెలిపారు. జమ్మూ రీజియన్​లో 2021 నుంచి టెర్రర్ రిలేటెడ్ ఘటనల్లో 70 మంది చనిపోయారు. వీరిలో 52 మంది జవాన్లు ఉన్నారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో 54 మంది టెర్రరిస్టులను ఎన్​కౌంటర్ చేశారు. కాగా, జమ్మూ రీజియన్​లో గడిచిన 32 నెలల్లో 48 మంది జవాన్లు అమరులయ్యారు.

అమరుల కుటుంబాలు కన్నీరుమున్నీరు

కెప్టెన్ బ్రిజేశ్ థాపాది వెస్ట్ బెంగాల్​లోని సిలిగురి ప్రాంతం. అతని తండ్రి కల్నల్ భువనేశ్ థాపా ఆర్మీ నుంచి కల్నల్ హోదాలో రిటైర్ అయ్యారు. 2019లోనే ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఇంతలోనే ఈ ఘోరం చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కానిస్టేబుళ్లు బిజేంద్ర, అజయ్​ది రాజస్థాన్. బిజేంద్ర సొంతూరు డుమోలి కలాన్. అజయ్​ది భైస్వాత కలాన్. తమ కొడుకు దేశం కోసం ప్రాణాలర్పించారంటూ అమరుల తల్లిదండ్రులు తెలిపారు.

జవాన్ల త్యాగం వృథా పోనివ్వం

దోడాలో ఎన్​కౌంటర్ జరిగిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అంతటా సెక్యూరిటీ టైట్ చేశారు. ఎల్వోసీ వెంట భద్రత పెంచారు. జమ్మూ కాశ్మీర్​లో టెర్రరిజాన్ని అంతం చేస్తామని, జవాన్ల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని  ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.