మూసీ, ఈసా నదులపై ..నాలుగు లేన్‌‌ల బ్రిడ్జిలు

మూసీ, ఈసా నదులపై ..నాలుగు లేన్‌‌ల బ్రిడ్జిలు
  • రూ.168  కోట్లతో నిర్మాణానికి హెచ్ఎండీఏ  సన్నాహాలు                                                      
  • నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్   

హైదరాబాద్​, వెలుగు: జంట నగరాల్లో ట్రాఫిక్ సమస్యల నివారణకు హెచ్‌‌ఎండీఏ మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.  ఈసా, మూసీ నదులపై నాలుగు లేన్ల బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది.  ఈ ప్రాజెక్టుకు మున్సిపల్​శాఖ మంత్రి  కేటీఆర్​ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.  ఈ నదులపై  మొత్తం14  బ్రిడ్జిలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాల పాటు వీటి నిర్మాణాల గురించి పట్టించుకోలేదు.   హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మూసీ నదిపై మూడు చోట్ల, ఈసానదిపై రెండు చోట్ల బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.  సుమారు రూ.168 కోట్ల వ్యయంతో  5  వంతెనల నిర్మాణ పనులకు హెచ్ఎండీఏ ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రోక్యూర్‌‌‌‌మెంట్ అండ్ కన్ స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో టెండర్ల  ప్రక్రియను పూర్తి చేసింది. హెచ్ఎండీఏ నిర్మించే అయిదు వంతెనల్లో   రూ. 42 కోట్లతో ఉప్పల్ బాగాయత్  లేఅవుట్ వద్ద నిర్మించనుండగా  రూ.35 కోట్లతో ప్రతాప సింగారం- గౌరెల్లి వద్ద మరొకటి నిర్మించనున్నారు.  రూ.39 కోట్లతో మంచిరేవుల వద్ద , రూ.32 కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్- 2 సమీపంలో ఈసా నది వద్ద మరో బ్రిడ్జి నిర్మించనున్నారు. 

 అయిదో వంతెనను  రూ. 20 కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్- 1 సమీపంలో ఈసా నదిపై నిర్మించనున్నారు. ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున మూసీపై నాలుగు వరుసల(ఫోర్ లైన్) వంతెన నిర్మాణం జరగనుండగా టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయినందున మంత్రి కేటీఆర్‌‌‌‌  సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.  నిర్మాణ పనులను 15 నెలల గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ బ్రిడ్జిలు పూర్తయితే  ప్రయాణం సులభతరం అవుతుంది.  ప్రయాణ దూరం, సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు.