దుబాయ్లో రోడ్డు ప్రమాదం : తెలుగు కుటుంబం మొత్తం మృతి

దుబాయ్లో రోడ్డు ప్రమాదం : తెలుగు కుటుంబం మొత్తం మృతి

జెడ్డా : సౌదీ అరేబియాలోని రియాద్ సమీపంలో శుక్రవారం (ఆగస్టు 25న) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఉమ్రా ప్రదర్శన అనంతరం వారు కువైట్‌కు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ అన్నమయ్య మదనపల్లికి చెందిన దండు గౌస్ బాషా కువైట్‌లోని అమెరికన్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యే కొత్త కారు కొన్నాడు. ఆ కారులో తన భార్య తబారక్ సర్వర్, ఇద్దరు కుమారులు ఏహాన్ (2), దామీల్ (ఎనిమిది నెలలు )లతో కలిసి  ఉమ్రా ప్రదర్శన చూసేందుకు కువైట్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లాడు. 

సౌదీలోని మక్కా, మదీనా దర్శించుకున్నాడు. మదీనాలోని ప్రవక్త మసీదులో ఉమ్రా నిర్వహించి..ప్రార్థనలు చేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి కువైట్‌కు వెళ్తుండగా శుక్రవారం (ఆగస్టు 25న) రోడ్డు ప్రమాదం జరిగింది. రియాద్‌లోని 120 కిలోమీటర్ల సమీపంలో హఫ్నా -తువాఖ్ రహదారిపై కారు డివైడర్ ను ఢీకొనడంతో 
మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. 

నలుగురి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. కారులోని పాస్ పోర్టులు, ఇతరత్రా సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. చనిపోయిన వారిని గుర్తించడం అక్కడి పోలీసులకు కష్టంగా మారింది. ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్ధిఖ్ తువ్వూర్.. మలయాళీ సంఘం కార్యకర్తల సహాయంతో బాధితులను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు విషయాన్ని చేరవేశాడు. 

విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నలుగురు మృతదేహాలను రుమా జనరల్ మార్చురీకి తరలించారు. దుబాయ్ చట్ట ప్రకారం..ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత డెడ్ బాడీలను ఇండియాకు పంపించనున్నారు. రోడ్డు ప్రమాదం గురించి తెలిసి గౌస్ బాషా తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.