ఢిల్లీలో ఫైర్​ యాక్సిడెంట్.. నలుగురు మృతి

ఢిల్లీలో ఫైర్​ యాక్సిడెంట్.. నలుగురు మృతి

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ బిల్డింగ్​లో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. ద్వారకాలోని ప్రేమ్​నగర్​ ఏరియాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. హీరా సింగ్​ ​(48) వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. అతని భార్య నీతు (40), ఇద్దరు కుమారులు రాబిన్(22), లక్షయ్​(21)తో పాటు అతని తల్లితో కలిసి రెండస్తుల బిల్డింగ్​లో నివాసముంటున్నారు. 

మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఫస్ట్​ఫ్లోర్​లో ఇన్వర్టర్ ​నుంచి మంటలు వ్యాపించి పక్కనే ఉన్న సోఫాకు అంటుకున్నాయి. ఆ తర్వాత ఇల్లంతా పొగ కమ్ముకుంది. దీంతో హీరా సింగ్, అతని భార్య, కుమారులు ఊపిరాడక అపస్మారక స్థితికి వెళ్లారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, గ్రౌండ్​ ఫ్లోర్​లో నిద్రిస్తున్న హీరా సింగ్ తల్లి సీతాదేవి ప్రాణాలతో బయటపడింది.