ఎదురుకాల్పుల్లో ఎస్సై మృతి

ఎదురుకాల్పుల్లో ఎస్సై మృతి
  • నలుగురు మావోయిస్టులు హతం
  • ఛత్తీస్‌గఢ్‌లో ఘటన
  • మృతుల్లో ఇద్మదరు హిళా మావోయిస్టులు

రాయ్‌పూర్‌‌: ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌‌ జిల్లా మన్‌పూర్‌‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పర్ధోనీ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ ఎన్‌కౌంటర్‌‌ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. వారిలో ఇద్దరు కీలక నేతలు ఉన్నారు. మావోయిస్టులను జరిపిన ఎదురుకాల్పుల్లో ఎస్సై ఎస్‌.కె. శర్మ చనిపోయినట్లు అధికారులు చెప్పారు. “ శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో పర్‌‌ధోనీ గ్రామం దగ్గర ఎన్‌కౌంటర్‌‌ జరిగింది. యాంటీ మావోయిస్ట్‌ ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. వారిని ఎదుర్కొనేందుకు పోలీసులు ఎదురుదాడికి దిగారు. సబ్‌ ఇన్స్‌పెక్టర్‌‌ ఎస్‌.కె. శర్మ ఫైరింగ్‌లో చనిపోయారు” అని రాజ్‌నంద్‌గోన్స్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) జితేంద్ర శుక్లా చెప్పారు. మావోయిస్ట్‌ డివిజనల్‌ కమిటీ మెంబర్లు అశోక్‌, ఏరియా కమిటీ మెంబర్‌‌ సీపీఐ (మావోయిస్ట్‌) కృష్ణతో పాటు మరో ఇద్దరు మహిళా మెంబర్లను సరిత, ప్రమిలను సిబ్బంది మట్టుబెట్టినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో ఏకే–47 రైఫిల్స్‌, ఎస్‌ఎల్‌ఆర్‌‌, రెండు 315 బోర్‌‌ రైఫిల్స్‌, కొన్ని ఆయుధాలు, వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లను కలిపి ఎంఎంసీ జోన్‌గా చేసుకుని కార్యకలాపాలు సాగించాలని మావోయిస్టులు ప్లాన్‌ చేసుకున్నారని ఎస్పీ చెప్పారు. ఈ ఎమ్‌ఎమ్‌సీ జోన్ కింద దాదాపు 180 మంది మావోయిస్టులు పనిచేస్తున్నట్లు తెలిసిందని ఛత్తీస్‌గఢ్‌ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు చెప్పారు. వారిలో చాలా మంది సౌత్‌ బస్తార్‌‌కు చెందిన వారిగా తెలిసిందన్నారు.