నాలుగున్నర కోట్లతో నాలుగు కొత్త లైబ్రరీ బిల్డింగులు!

నాలుగున్నర కోట్లతో నాలుగు కొత్త లైబ్రరీ బిల్డింగులు!
  • కంటోన్మెంట్ పరిధిలో నిర్మించాలని బోర్డు నిర్ణయం
  • తిరుమలగిరి, బోయిన్​పల్లి, బొల్లారంలో స్థలాల గుర్తింపు
  • తాడ్​బండ్ లేదా రసూల్​పురాలో నాలుగోది నిర్మించే ఆలోచన

కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్​బోర్డు పరిధిలో రూ.4.5 కోట్లతో కొత్తగా నాలుగు లైబ్రరీ బిల్డింగులు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. నిధులు కూడా మంజూరు అయ్యాయి. తిరుమలగిరి, బోయిన్​పల్లి, బొల్లారం, తాడ్​బండ్ ​ప్రాంతాల్లో నిర్మించాలని ప్రతిపాదనలు చేయగా, తిరుమలగిరి, బోయిన్​పల్లి, బొల్లారం ప్రాంతాలలో ఇప్పటికే స్థలాలను ఖరారు చేశారు. నాలుగో బిల్డింగ్​ను తాడ్​బండ్​లో నిర్మించాలా? లేక రసూల్​పురా, లేదంటే మూడో వార్డులోని అందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతంలో నిర్మించాలా? అనే దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం తిరుమలగిరిలోని మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్​సమీపంలో ఉన్న లైబ్రరీ చాలా పెద్దది. ఇక్కడ అన్ని రకాల న్యూస్​ పేపర్లతోపాటు దాదాపు 18 వేల నుంచి 20 వేల వరకు వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

అయితే ఈ లైబ్రరీ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో యువతతోపాటు పుస్తక ప్రియులు అధికంగా వస్తున్నారు. మరింత సౌకర్యవంతంగా ఉండేలా పెద్ద బిల్డింగ్​నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది. ఇక బొల్లారంలోని లైబ్రరీలో 13,628 పుస్తకాలు, న్యూస్​పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఈ లైబ్రరీ ఓ ప్రైవేట్ బిల్డింగ్​లో కొనసాగుతోంది. బోయిన్​పల్లిలోని లైబ్రరీలో 20 వేల నుంచి 25 వేల పుస్తకాలు, అన్ని రకాల న్యూస్ పేపర్లు అందుబాటులో ఉన్నా సరైన సదుపాయాలు లేవు. వీటితోపాటు బోర్డు పరిధిలోని వాసవీ నగర్, టీచర్స్​కాలనీ, ఇతర కాలనీల్లో కాలనీ సంక్షేమ సంఘాలు లైబ్రరీలు నిర్వహిస్తున్నాయి. లైబ్రరీల్లో మెరుగైన సదుపాయాలు, ఆధునిక వసతులు కల్పించాలని నిర్ణయించిన అధికారులు నాలుగు కొత్త బిల్డింగులు కట్టాలని నిర్ణయించారు.

12 లైబ్రరీలు అద్దె వాటిలోనే..

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో18 లైబ్రరీలు ఉండగా, ఆరింటికి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 12 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని గ్రంథాలయ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటికి కూడా సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించి, కంటోన్మెంట్ ​బోర్డు అధికారుల సహకారంతో స్థలాలు ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ నెలలో జరిగిన బోర్డు సమావేశంలో ప్రత్యేక అజెండాలో ఈ అంశాన్ని చేర్చారని తెలిపారు. బోర్డు పరిధిలో నిర్మించే భవనాలకు గ్రంథాలయ శాఖ నుంచి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. కంటోన్మెంట్ ​ఏరియాలో కొత్త లైబ్రరీలు నిర్మించాలని ఎన్నో ఏండ్ల నుంచి ప్రతిపాదనలు ఉన్నాయని స్థానిక బీఆర్ఎస్​ అధ్యక్షుడు రాజశేఖర్​రెడ్డి చెప్పారు. ఇటీవల మేడ్చల్​–మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయాల చైర్మన్​కు పరిస్థితిని వివరించి నిర్మాణానికి ప్రత్యేక కసరత్తు చేసినట్లు తెలిపారు.