- పీఆర్సీ అమలుకు కట్టుబడి ఉన్నం
- టీఎస్టీయూ నేతలతో మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా రంగం, టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను మంజూరు చేస్తామని, అలాగే పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ (టీఎస్టీయూ) నూతన డైరీని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లాతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా యూనియన్ నేతలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుపోయారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. 317 జీఓ కారణంగా నష్టపోయిన టీచర్లకు న్యాయం చేస్తామని, అలాగే స్పౌజ్ బదిలీల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీయూ నేతలు పాల్గొన్నారు.
