తెలంగాణలో కరెంట్ షాక్తో నలుగురు మృతి..

తెలంగాణలో  కరెంట్ షాక్తో  నలుగురు మృతి..
  • వినాయకుడి విగ్రహాలు 
  • తరలిస్తుండగా ముగ్గురు.. 
  • మండపం వేస్తుండగా ఒకరు
  • హైదరాబాద్, కామారెడ్డిలో ఘటనలు

ఎల్బీనగర్/కామారెడ్డి/అంబర్​పేట, వెలుగు: వినాయక విగ్రహాలు తరలిస్తుండగా కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు, మండపం వేస్తుండగా ఒకరు చనిపోయారు. హైదరాబాద్​లో ఇద్దరు, అంబర్​పేటలో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడు ఘటనల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాతబస్తీలోని పురాణపూల్​కు చెందిన వికాస్, అఖిల్​తో పాటు మరికొందరు యువకులు ప్రతీ ఏడాది గణపతి కూర్చోబెడ్తారు.

22 ఫీట్ల వినాయకుడి విగ్రహాన్ని రంగారెడ్డి జిల్లా జల్​పల్లిలో కొని బండ్లగూడ మీదుగా పురాణపూల్​కు ట్రాక్టర్ మీద తీసుకొస్తున్నారు. డ్రైవర్ ధోనీ ట్రాక్టర్ నడుపుతుండగా.. వికాస్, అఖిల్ టోచ్​పై కూర్చున్నారు. సోమవారం రాత్రి 11.30 వద్ద బండ్లగూడ రాయల్ సీ హోటల్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా.. హైటెన్షన్ వైర్లు వినాయకుడి విగ్రహానికి తాకాయి. దీంతో ట్రాక్టర్​కు కరెంట్ సప్లై అయింది. డ్రైవర్ ధోనీకి షాక్ కొట్టడంతో ఎగిరి ట్రాక్టర్ టైర్ల కింద పడిపోయాడు. వెహికల్ ధోనీ (22)పై నుంచి వెళ్లడంతో చనిపోయాడు. టోచ్​పై కూర్చున్న వికాస్, అఖిల్ కూడా షాక్​కు గురయ్యారు. 21 ఏండ్ల వికాస్ స్పాట్​లోనే చనిపోయాడు. అఖిల్ తీవ్రంగా గాయపడగా.. అతన్ని ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. ట్రాక్టర్​పై ఉన్న ధోనీ తమ్ముడు బన్నీ, అతని ఫ్రెండ్ త్యాగికీ షాక్ తగిలింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వికాస్.. డిగ్రీ చదువుతూ.. జూ పార్క్​లో పార్ట్​ టైమ్ జాబ్ చేస్తున్నాడు. 

పచ్చి కర్రకు కరెంట్ సప్లై కావడంతో..

హైదరాబాద్ బాగ్ అంబర్​పేటకు చెందిన శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రతి ఏడాది వినాయకుడిని కూర్చోబెడ్తారు. సోమవారం రాత్రి రామ్ చరణ్.. తన ఫ్రెండ్స్ తో కలిసి వెదురు కర్రలతో మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మండపం వేసే క్రమంలో 15 ఫీట్లు ఉన్న కర్రను రామ్ చరణ్ పైకి లేపాడు. పచ్చిగా ఉన్న కర్ర కాస్త 11 కేవీ హైటెన్షన్ వైర్లను తాకడంతో కరెంట్ సప్లై అయింది. దీంతో రామ్​చరణ్ (18) కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయం త్రం చనిపోయాడని ఇన్​స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.

వినాయకుడిపై ఉన్న సలాకా తగిలి..

సిరిసిల్లా పట్టణంలోని గోపాల్​నగర్​కు చెందిన విశ్వరాజ గణేశ్ మండలి సభ్యులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలోని పెర్కిట్ వద్ద వినాయకుడి విగ్రహం కొన్నారు. 21 ఏండ్ల విగ్రహం తెచ్చేందుకు 15 మంది పెర్కిట్ వెళ్లారు. సోమవారం రాత్రి విగ్రహాన్ని ట్రాలీలో ఎక్కించుకుని గోపాల్​నగర్​కు బయల్దేరారు. మంగళవారం పొద్దున పాల్వంచ మండలం ఆరేపల్లి స్టేజీ వద్దకు వచ్చారు. విగ్రహంపై ఉన్న సలాకా.. కరెంట్ వైర్లకు తాకడంతో అందరూ షాక్​కు గురయ్యారు. సిరిసిల్ల సుభాష్ నగర్​కు చెందిన లక్ష్మినారాయణ, సాయిలు ట్రాలీపై నుంచి కింద పడ్డారు. వీరిద్దరిని స్థానికులు ప్రైవేట్ హాస్పిటల్​కు తీసుకెళ్లగా.. లక్ష్మినారాయణ (19) చనిపోయాడు. మంగళవారం లక్ష్మినారాయణ బర్త్ డే కావడంతో సిరిసిల్ల వెళ్లి కేక్ కట్ చేసుకుందామని అనుకున్నారు. కానీ.. కరెంట్ షాక్​తో చనిపోయాడు. మృతుడు ఐటీఐ పూర్తి చేశాడు. తండ్రి మైసయ్య దుబాయ్​లో ఉంటున్నాడు. సిరిసిల్ల హాస్పిటల్​లో తల్లి కాంట్రాక్ట్ ఏఎన్​ఎంగా పని చేస్తున్నది. మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.