మన దేశ మూలాలున్న నలుగురికి అమెరికా కాంగ్రెస్​లో కీలక పదవులు

మన దేశ మూలాలున్న నలుగురికి అమెరికా కాంగ్రెస్​లో కీలక పదవులు
  • ప్రమీలా జయపాల్​కు  ఇమిగ్రేషన్​ వ్యవహారాల కమిటీలో చోటు

వాషింగ్టన్: భారత మూలాలున్న నలుగురు అమెరికా కాంగ్రెస్​ సభ్యులను కీలక పదవులు వరించాయి. కాంగ్రెస్​ లోని మూడు కీలకమైన సభా సంఘాల్లో ప్రమీలా జయపాల్​, అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నాలకు చోటు దక్కింది. 

ప్రమీలా జయపాల్​ 

ఇమిగ్రేషన్​ వ్యవహారాలకు సంబంధించిన జ్యుడీషియరీ కమిటీలో ర్యాంకింగ్​ మెంబర్​గా ప్రమీలా జయపాల్ కు ​అవకాశం లభించింది. విదేశీ మూలాలున్న వ్యక్తికి ఈ కమిటీలో చోటు లభించడం ఇదే తొలిసారి.  57 ఏళ్ల ప్రమీలా జయపాల్​ వాషింగ్టన్​స్టేట్​లోని 7వ డిస్ట్రిక్ట్ నుంచి అమెరికా కాంగ్రెస్​లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  

అమీ బెరా 

అమెరికా కాంగ్రెస్​లో ఇంటెలిజెన్స్​ వ్యవహారాలను పర్యవేక్షించే కమిటీలో 57 ఏళ్ల అమీ బెరాకు చోటు దక్కింది. సెంట్రల్​ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ), నేషనల్​ ఇంటెలిజెన్స్​ కార్యాలయం, నేషనల్​ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్​ఎస్​ఏ) , మిలిటరీ ఇంటెలిజెన్స్​ వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.  కాంగ్రెస్​కు చెందిన ఫారిన్​ అఫైర్స్​ కమిటీ, సైన్స్​, స్పేస్​ అండ్​ టెక్నాలజీ కమిటీలోనూ ఆయన సభ్యులుగా వ్యవహరించనున్నారు. కాలిఫోర్నియా స్టేట్​లోని 6వ జిల్లా నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు అమీ బెరా కాంగ్రెస్​ కు ఎన్నికయ్యారు.  

రాజా కృష్ణమూర్తి 

చైనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అమెరికా కాంగ్రెస్​ కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలో ర్యాంకింగ్​ మెంబర్​గా రాజా కృష్ణమూర్తి నియమితులయ్యారు. చైనా నుంచి అమెరికా సహా ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పుపై ఈ కమిటీ దృష్టిపెడుతుంది. 49 ఏళ్ల రాజా కృష్ణమూర్తి  ఇల్లినాయిస్​ స్టేట్​ లోని 8వ డిస్ట్రిక్ట్​ నుంచి కాంగ్రెస్​కు నాలుగు సార్లు  ఎన్నికయ్యారు. 

రో ఖన్నా 

చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలోనే 46 ఏండ్ల రో ఖన్నాకు సైతం చోటు దక్కింది. ఈయన కాలిఫోర్నియా స్టేట్​లో ని 17వ జిల్లా నుంచి కాంగ్రెస్​కు ఇప్పటివరకు 4 సార్లు ఎన్నికయ్యారు.