
- కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ‘ఆక్సియమ్-1’ మిషన్ షురూ
- ఒక్కొక్కరికి రూ.417 కోట్ల చార్జి
- ఐఎస్ఎస్ లో 8 రోజులు మకాం
వాషింగ్టన్: అంతరిక్షానికి తొలిసారిగా నలుగురు ప్రైవేట్ ఆస్ట్రోనాట్ లు బయలుదేరారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సైంటిఫిక్ ప్రైవేట్ మిషన్ కు శనివారం ఆక్సియమ్ స్పేస్ అనే సంస్థ శ్రీకారం చుట్టింది. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 11.17 గంటలకు నలుగురు ఆస్ట్రోనాట్ లతో కూడిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ను మోసుకుని స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్లింది. దీంతో ‘ఆక్సియమ్-1’ మిషన్ విజయవంతంగా షురువైంది. ఈ మిషన్‌కు నాసా మాజీ ఆస్ట్రోనాట్ మైకేల్ లోపెజ్ అలెగ్రియా కమాండింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికాకు చెందిన రియల్ఎస్టేట్ ఇన్వెస్టర్ లారీ కానర్, కెనడా బిజినెస్‌మ్యాన్ మార్క్ పాథీ, ఇజ్రాయెల్ మాజీ పైలట్, ఎంట్రప్రెన్యూర్ ఈటాన్ స్టీబా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు బయలుదేరారు. వీరు అక్కడ 8 రోజుల పాటు ఉంటారు. స్పేస్‌లో వయసుపై కలిగే ప్రభావాలు, మూలకణాలపై పరిశోధనలు, సెల్ఫ్ అసెంబ్లింగ్ స్పేస్‌క్రాఫ్ట్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ ప్రయోగాలు చేస్తారు. 2003లో కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో చనిపోయిన తన స్నేహితుడు, ఇజ్రాయెల్ తొలి ఆస్ట్రోనాట్ ఇలాన్ రామన్‌కు అంతరిక్షంలో నివాళి అర్పించాలని స్టీబా భావిస్తున్నారు. ప్రమాదం తర్వాత రామన్ డైరీలో మిగిలిన పేజీలు, ఆయన పిల్లలు ఇచ్చిన జ్ఞాపికలను తీసుకెళ్లారు.
ఒక్క టికెట్ రేటు రూ. 417 కోట్లు
ఈ జర్నీ కోసం ఒక్కొక్కరికి సుమారు రూ.417.30 కోట్లు(5.5 కోట్ల డాలర్లు) చార్జ్ చేసినట్టు సమాచా రం. అంతరిక్షంలోకి వెళ్తున్న వాళ్లు అక్కడ జాలీగా గడపడానికి వెళ్లడంలేదని, పూర్తి సైంటిఫిక్ పరిశోధనలు చేస్తారని ఆక్సియమ్ స్పేస్ ఆపరేషన్స్ డైరెక్టర్ డెరెక్ హాస్మాన్ చెప్పారు. వాస్తవానికి ఇప్పటికే 2 ప్రైవేట్ (రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్, అమెజాన్ జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్) మిషన్లను నిర్వహించినా.. వాళ్లు కేవలం టూర్ పర్పస్‌లో అంతరిక్ష హద్దుల దాకా వెళ్లి మళ్లీ వెంటనే వెనక్కు వచ్చారు. కానీ, ఆక్సియమ్–1 ప్రయోగంలో ఆస్ట్రోనాట్లు ఐఎస్ఎస్ పరిశోధనల్లో భాగం కానున్నారు.
ఆక్సియమ్ సొంత స్పేస్ స్టేషన్
మొత్తంగా 4 ప్రైవేట్మిషన్స్ చేసేందుకు ఆక్సియమ్తో నాసా ఒప్పందం చేసు కుంది. ఆక్సియమ్–2 మిషన్‌కూ నాసా ఇప్పటికే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అంతరిక్షంలో ఒకే ఒక్క స్పేస్ స్టేషన్ ఉన్న సంగతి తెలిసిందే. చైనా కూడా సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఆక్సియమ్ కూడా తనకంటూ ఓ స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా 2024 సెప్టెంబర్ నాటికి తొలి మాడ్యూల్‌ను ప్రయోగిస్తామని కంపెనీ సీఈవో, ప్రెసిడెంట్ మైకేల్ సఫ్రెదినీ ఇప్పటికే ప్రకటించారు. మాడ్యూల్‌ను ఐఎస్ఎస్కు అటాచ్ చేసి.. ఆక్సియమ్ స్పేస్ స్టేషన్‌ను నిర్మించాలనుకుంటోం ది. ఐఎస్ఎస్ను సర్వీస్ నుంచి తొలగించాక 2030లో దీనిని వాడకంలోకి తేవాలనుకుంటోంది.