న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంపై ఆ కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన చేశారు. 2025, డిసెంబర్ 15 లోపు ఇండిగో సేవలు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. శుక్రవారం (డిసెంబర్ 5) వెయ్యికి పైగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇండిగోకు ఇదొక చెత్త రోజు అని ఆయన అభివర్ణించారు.
కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనలు అమలులోకి రావడం, చిన్నపాటి సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌వేర్ లోపం వల్ల గత నాలుగు రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందల సంఖ్యలో విమానాలు రద్దు కాగా.. కొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. మంగళవారం 100కిపైగా, బుధవారం 200కు పైగా విమాన సర్వీస్‌లను రద్దు చేసింది. గత నెల రోజుల్లో 1,232 విమాన సర్వీసులను నిలిపివేసింది.
►ALSO READ | ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్.. DGCA ఆదేశాల నిలిపివేత.. హై లెవెల్ కమిటీతో విచారణకు ఆదేశం
ఇండిగో ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్ బుధవారం 35 శాతం నుంచి 19శాతానికి పడిపోయింది. ఉన్నఫలంగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. వెంటనే టోల్ ఫీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రయాణికులకు పూర్తి రిఫండ్ చెల్లించాలని ఇండిగోను ఆదేశించింది.
