సీఐఐ గ్లోబల్ సమ్మిట్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూట్ గోల్డ్ కేటగిరీలో అవార్డు సాధించింది. శుక్రవారం (డిసెంబర్ 05) ఢిల్లీలోని ఇండియన్ హాబిటేట్ సెంటర్ లో జరిగిన సమ్మిట్ లో.. అవార్డును స్వీకరించారు బీఆర్ అంబేడ్కర్ ఇనిస్టిట్యూట్స్ కరస్పాండెంట్ డా. గడ్డం సరోజ వివేకనంద్, కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, ఎంపీ వంశీకృష్ణ. తమ ఇనిస్టిట్యూట్ కు గోల్డ్ కేటగిరీలో అవార్డు దక్కటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కరస్పాండెంట్ డా.గడ్డం సరోజ అన్నారు.
అణగారిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు అంబేద్కర్ ఇనిస్టిట్యూట్స్ గొప్ప అవకాశం కల్పిస్తోందని ఈ సందర్భంగా డా.సరోజ అన్నారు. ఆరువేల మంది విద్యార్థులు ప్రస్తుతం తమ ఇనిస్టిట్యూట్ లో చదువుతున్నట్లు చెప్పారు. తమ సంస్థ నుంచి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారని తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జీలుగా, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అత్యున్నత పదవుల్లో ప్రస్తుతం సేవలందిస్తున్నారని తెలిపారు. వారందరి తరపున ఈ అవార్డును అందుకున్నట్లు చెప్పారు.
ఇండియా టుడే సర్వేలో బీఆర్ అంబేద్కర్ లా కాలేజ్ తెలంగాణ లో రెండో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఆల్ ఇండియాలో ఐదో స్థానాన్ని దక్కించుకుందని తెలిపారు. న్యాక్ లో డిగ్రీ కాలేజీ కి ఏ గ్రేడ్, తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క న్యాక్ అక్రిడేటెడ్ లా కాలేజ్ గా తమ సంస్థ నిలిచినట్లు తెలిపారు. న్యాక్ బీ ప్లస్ ప్లస్ రావటం తమ విద్యార్థుల ఘనత అని తెలిపారు. విద్యార్థుల శ్రమ, ప్రతిభ జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో గొప్ప కాలేజీలుగా నిలుపుతున్నట్లు చెప్పారు. ఈ అవార్డు తమపై మరింత బాధ్యత పెంచిందని అన్నారు.
►ALSO READ | డిసెంబర్ 15 లోపు సాధారణ స్థితికి ఇండిగో సేవలు: సీఈవో పీటర్ ఎల్బర్స్
జూనియర్ కాలేజ్ లో ప్రతియేటా దాదాపు నాలుగు స్టేట్ ర్యాంక్ లు దక్కుతున్నట్లు చెప్పారు డా.సరోజ. 80 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులకు బీఆర్ అంబేడ్కర్ ఇనిస్టిట్యూట్స్ లో ఉచితంగా విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మరిన్ని ర్యాంక్ లతో పాటూ దేశంలో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ లు తమ కాలేజీ పూర్వ విద్యార్థులని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. మరెంతో మంది పొలిటిషియన్స్ ను బీఆర్ అంబేడ్కర్ ఇనిస్టిట్యూట్ ఇచ్చిందని చెప్పారు.
