- నలుగురు స్టూడెంట్లకు అధిక మార్కులు కలిపినట్లు ఆరోపణ
వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో సోమవారం విజిలెన్స్ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. అక్టోబర్ 7 నుంచి నవంబరు ఒకటి వరకు యూనివర్సిటీ పరిధిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ థియరీ, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరిగాయి. మొత్తం 2,123 మంది పీజీ విద్యార్థులు హాజరుకాగా, 205 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో 155 మంది రీవాల్యుయేషన్‌కు అప్లై చేశారు.
అయితే నలుగురు విద్యార్థుల వద్ద పెద్దమొత్తంలో డబ్బులు తీసుకొని అధికంగా మార్కులు కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు విద్యార్థులు విజిలెన్స్ విభాగానికి సమాచారం ఇచ్చారు. విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మల్లయ్య, ఇంటెలిజెన్స్ సీఐ రాంప్రసాద్ సోమవారం వర్సిటీకి చేరుకున్నారు. పరీక్షల విభాగానికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తూ అధికారుల నుంచి సమాచారం సేకరించారు.
