హఫీజ్ సయీద్​కు నాలుగంచెల భద్రత.. పహల్గాం దాడి తర్వాత ఆర్మీతో సెక్యూరిటీ పెంచిన పాక్​

హఫీజ్ సయీద్​కు నాలుగంచెల భద్రత.. పహల్గాం దాడి తర్వాత ఆర్మీతో సెక్యూరిటీ పెంచిన పాక్​

ఇస్లామాబాద్: పహల్గాం దాడి తర్వాత లష్కరే తయిబా చీఫ్​ హఫీజ్​ సయీద్​కు పాకిస్తాన్​ సర్కారు భద్రతను పెంచింది. గతంతో పోలిస్తే అతడి సెక్యూరిటీని నాలుగు అంచెలకు పెంచేసింది. అతడి ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది. ఈ మేరకు  జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లాహోర్‌‌ లో రద్దీ  ప్రాంతమైన మొహల్లా జోహార్ టౌన్‌‌లో ఉన్న హఫీజ్​ ఇంటి చుట్టూ పాక్‌‌   ఆర్మీ, ఐఎస్‌‌ఐ, లష్కరే ముఠా 24 గంటలు పహారా కాస్తున్నట్టు సమాచారం.  

అతడి ఇంటి కాంపౌండ్‌‌ చుట్టూ  ఆర్మీ డ్రోన్లతో నిఘా పెట్టినట్లు తెలుస్తున్నది. హఫీజ్‌‌ ఇంటికి నలువైపులా దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలో సీసీ కెమెరాలను అమర్చడంతోపాటు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. ఆ ఇంటిచుట్టుపక్కలకు ఎవరినీ అనుమతించడం లేదు. పహల్గాం ఉగ్రదాడికి లష్కరే అనుబంధ సంస్థ ‘ది రెస్టిస్టెన్స్​ఫ్రంట్​’ (టీఆర్ఎఫ్) బాధ్యత వహించింది. 

దీంతో ఈ టెర్రర్​ అటాక్ ​వెనుక హఫీజ్ ఉన్నట్టు భారత్​ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అతడిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయొచ్చన్న అంచనాలతోనే  సెక్యూరిటీని అమాంతం పెంచినట్లు సమాచారం.