
హైదరాబాద్ : శ్రీశైలంలో హైడల్ పవర్ జనరేషన్‌పై పంచాయితీలొద్దని తెలంగాణ, ఏపీ పరస్పర అంగీకారానికి వచ్చాయి. ఏపీ విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్ర భూభాగంలో ఉన్న పవర్ ప్రాజెక్టులు ఆ రాష్ట్రానికే చెందుతాయని, అక్కడ చేసే కరెంట్ ఉత్పత్తిపై గొడవలొద్దనే నిర్ణయానికి వచ్చాయి. ప్రాజెక్టు దిగువన తాగు, సాగు నీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే పవర్ జనరేషన్ చేయాలని ఏపీ మెలిక పెట్టింది. గురువారం జలసౌధలో కేఆర్ఎంబీ మెంబర్ రవికుమార్ పిళ్లై అధ్యక్షతన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) నాలుగో సమావేశం నిర్వహించారు. కేఆర్ఎంబీ మెంబర్ (పవర్) మౌన్‌తంగ్, తెలంగాణ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, ఇంటర్ స్టేట్ సీఈ మోహన్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. పవర్ జనరేషన్‌పై కేఆర్ఎంబీ సెక్రటేరియట్ ఆదేశాలు చెల్లుబాటు కావని, బోర్డుకు ఎలాంటి అధికారాలు లేవని రెండు రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. పవర్ జనరేషన్‌పై ప్రత్యేకంగా స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసి చర్చించి ఏకాభిప్రాయం తీసుకురావాలని నిర్ణయించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణకే చెందుతుందని కేఆర్ఎంబీ రూపొందించిన జిస్ట్లో పేర్కొనడాన్ని ఏపీ తప్పు బట్టింది. సాగర్ ఉమ్మడి ప్రాజెక్టేనని, రెండు రాష్ట్రాలకు అధికారముంటుందని చెప్పడంతో జిస్ట్లోంచి తెలంగాణ అనే పదాన్ని తొలగించారు.
కనీస నీటి మట్టంపై పేచీ
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్, ప్రొటోకాల్‌పై సమావేశంలో చర్చించారు. శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులుగా బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో ఉందని బోర్డు సభ్యులు వివరించగా, తెలంగాణ దాన్ని తిరస్కరించింది. జల విద్యుత్ కోసమే శ్రీశైలం నిర్మించారని, కనీస నీటిమట్టం 834 అడుగులుగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. సాగర్ కింద తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు శ్రీశైలంలో కనీస నీటిమట్టంతో సంబంధం లేకుండా కరెంట్ ఉత్పత్తి చేసే అవకాశం ఇవ్వాలని, తాగు నీటి కోసం పవర్ జనరేషన్ చేసేప్పుడు కనీస నీటిమట్టం అనే అంశమే ఉత్పన్నం కాదని తెలంగాణ స్పష్టం చేసింది.