చిరు ధాన్యాల వినియోగంతో సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుంది. ప్రస్తుతం జీవన శైలిలో వస్తున్న మార్పుల వల్ల ప్రతి ఒక్కరూ చిరుధాన్యాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు.
రోజూ తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్, ఖనిజ లవణాలు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే చిరుధాన్యాలు తీసుకోవాల్సిందే. వాటిల్లో రాగులు, సజ్జలు, సామలతో పాటు అరికెలు (కోడో మిల్లెట్స్) కూడా ఉన్నాయి. అరికెలతో రకరకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు.. ఇప్పుడు అరికల ఆహారం గురించి తెలుసుకుందాం. . .!
అరికె టొమాటో పులావ్ తయారీకి కావలసినవి
- అరికెలు :1 కప్పు
- ఉల్లి తరుగు :2 టేబుల్ స్పూన్లు
- టొమాటో ముక్కలు: 3 టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి తరుగు: 2 టేబుల్ స్పూన్లు
- అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
- కారం: 1 టీస్పూన్
- ధనియాల పొడి : అర టీస్పూన్
- పసుపు: పావు టీస్పూన్
- ఉప్పు: తగినంత
- గరంమసాలా పొడి: పావు టీస్పూన్
- నీళ్లు: ఒకటిన్నర కప్పు
- నెయ్యి: 1 టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క: కొంచెం
- లవంగాలు: 3
- యాలకుల పొడి: పావు టీస్పూన్
- జీలకర్ర: అర టీస్పూన్
- సోంపు :అర టీస్పూన్
- కొత్తిమీర :తరుగు కొంచెం
తయారీ విధానం: అరికలను బాగా కడిగి పది నిమిషాలు నానబెట్టాలి. ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేడి చేసి జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులపొడి, ఉల్లితరుగు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నాగా వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. ఇప్పుడు నానబెట్టిన అరికలు వేసి రెండు నిమిషాలు వేగించాలి. తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు మీడియం మంటపై ఉడికించాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి గరం మసాలా పొడి, కొత్తిమీర తరుగు కలిపి సర్వ్ చేయాలి.
►ALSO READ | Good Health: పొద్దున్నే ఇవి తాగినా.. తిన్నా యమడేంజర్...
అరికె రవ్వ ఇడ్లీ తయారీకి కావలసినవి
- అరికరవ్వ : 1 కప్పు
- పుల్లటి పెరుగు: పావు కప్పు
- ఆవాలు: అర టీస్పూన్
- జీలకర్ర: అర టీస్పూన్
- శనగపప్పు: 1 టీస్పూన్
- మినపప్పు: 1 టీస్పూన్
- కరివేపాకు.. 1 రెమ్మ
- ఇంగువ : చిటికెడు
- నెయ్యి: 2 టీస్పూన్లు
తయారీవిధానం: ఒక గిన్నెలో అరిక రవ్వ తీసుకుని దానికి పెరుగు.. కొంచెం నీళ్లు కలిపి ఇడ్లీ పిండిలా జారుగా చేసి పక్కన పెట్టాలి. తర్వాత ఒక పాన్ లో నెయ్యి వేడి చేసి ఆవాలు,జీలకర్ర. శెనగపప్పు, మిన పప్పు, ఇంగువ, కరివేపాకు వేసి వేగించాలి. ఈ పోవును ముందు చేసుకున్న పిండిలో కలిపి ఇడ్లీలుగా చేయాలి. ఈ అరిక ఇడ్లీలు తయారు చేసుకో వడానికి పది నిమిషాలు (చిన్న మంటపై)
సరిపోతుంది. పెరుగు బదులు పుల్లటి మజ్జిగైనా కలుపుకో వచ్చు.
ఆరోగ్య లాభాలు
- మనదేశంలో ఎక్కువగా వినియోగించే చిరుధాన్యాల్లో అరికెలు కూడా ముఖ్యమైనవి. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లోనూ, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థాయ్ లాండ్ లాంటి దేశాల్లోనూ అరికెలు పండిస్తారు.
- మిగిలిన చిరుధాన్యాల లాగే అరికెలు కూడా వెంటనే శక్తినిస్తాయి. నెమ్మదిగా జీర్ణం కావడంతో త్వరగా అకలి కానివ్వవు జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
- అరికెల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదా ర్థాలు పుష్కలంగా ఉంటాయి. బీ1, బీ2, వీ3,బీ5, బీ6. విటమిన్లు క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి..
- అరికెలు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. రక్త హీనతను నివారిస్తాయి. మధుమేహం. గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
- వీటిలో పుష్కలంగా ఉండే సూక్ష్మపోషకాల వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు నివారించవచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే ఇబ్బందు లకు కూడా అరికెలు మంచివి.
- మహిళలకు అరికెలు ఎంతో మేలు చేస్తాయి. రుతుస్రావం సరిగా రాని వాళ్లకు ఇవి మంచి ఔషధం అదేవిధంగా కంటి నరాల బలానికి పుండ్లు, గడ్డలు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి
- అరికె పిండిని వాపులకు పూతగా వాడతారు. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్లకి మంచి ఆహారం
