నవంబర్లో ఎఫ్​పీఐల కొనుగోళ్ల జోరు

నవంబర్లో ఎఫ్​పీఐల కొనుగోళ్ల జోరు

న్యూఢిల్లీ:  విదేశీ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియో ఇన్వెస్టర్లకు భారతీయ ఈక్విటీలపై ఇష్టం పెరుగుతోంది. ఇక నుంచి దూకుడుగా వడ్డీ రేట్ల పెంపు ఉండదని,  మాక్రో ఎకానమీ బాగుంటుందనే నమ్మకంతో ఈ నెలలో ఇప్పటివరకు స్టాక్​మార్కెట్లో రూ. 31,630 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో వీళ్లు భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక ముందు మాత్రం ఇలా చేసే అవకాశం లేదని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ధరల భారం తగ్గడం, అమెరికా ఎకానమీ బాగుండటం, ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ  బలంగా ఉండటం కూడా ఎఫ్​పీఐ ఇన్‌‌‌‌ఫ్లోలను నడిపిస్తున్నాయి. డిపాజిటరీల వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, నవంబర్ 1-–25 మధ్య కాలంలో ఎఫ్​పీఐలు ఈక్విటీలలో రూ. 31,630 కోట్ల నికర మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాయి.  అక్టోబర్, సెప్టెంబరులో వరుసగా రూ. 8 కోట్లు  రూ. 7,624 కోట్ల ఇన్​ఫ్లో ఉంది. ఆగస్టులో  ఎఫ్​పీఐలు 51,200 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. జూలైలో దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

డాలర్​ విలువ బాగా పెరగడంతో ఎఫ్​పీఐలు  2021 అక్టోబర్ నుంచి  వరుసగా తొమ్మిది నెలల పాటు పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు. యుద్ధం వంటి పరిస్థితుల కారణంగా ఎఫ్​పీఐ ఇన్​ఫ్లోలు సమీప కాలంలో అస్థిరంగానే ఉంటాయని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఈక్విటీల్లో ఎఫ్‌‌‌‌పీఐల మొత్తం ఔట్‌‌‌‌ఫ్లో రూ.1.37 లక్షల కోట్లుగా ఉంది. గ్లోబల్ కౌంటర్లతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థతో పాటు రూపాయి బాగుండటం వల్ల నవంబర్‌‌‌‌లో  ఇన్‌‌‌‌ఫ్లోలు పెరిగాయని మార్నింగ్‌‌‌‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ - మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. బుల్లిష్ మార్కెట్ సెంటిమెంట్లు బలంగా ఉండటంతో సెన్సెక్స్,  నిఫ్టీలు నవంబర్ 25 న రెండవ వరుస సెషన్‌‌‌‌లో లైఫ్​టైమ్​ హైలకు వెళ్లాయి.  ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్‌‌‌‌లో ఎఫ్‌‌‌‌పీఐ కొనుగోళ్లు 
కనిపించాయి.