ఫ్రాన్స్‌లో ముద్దులపై ఆంక్షలు: ‘లా బిసే’ సంప్రదాయానికి బ్రేక్

ఫ్రాన్స్‌లో ముద్దులపై ఆంక్షలు: ‘లా బిసే’ సంప్రదాయానికి బ్రేక్

ఫ్రాన్స్‌లో ఎప్పటి నుంచో వస్తున్న ఓ సంప్రదాయానికి అక్కడి ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు ఇచ్చే ముద్దులు పెట్టుకునే ఆనవాయితీని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రాన్స్‌లో ‌ ఇద్దరు వ్యక్తులు ఎదురైనప్పుడు బుగ్గపై లేదా పెదాలపై ముద్దు పెట్టడం ద్వారా విష్ చేసుకుంటారు. ఈ పలకరితను ఆ దేశంలో ‘లా బిసే’ అని పిలుస్తారు. కరోనా వైరస్ భయం వల్ల ఈ సంప్రదాయానికి కొన్నాళ్లపాటు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ మంత్రి ఓలివైర్ వెరాన్ ప్రకటించారు.

ఆంక్షలు వెంటనే అమలులోకి

చైనాలో పుట్టిన కరోనా వైరస్ దాదాపు 50 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రస్తుతం కొన్ని యూరోపియన్ దేశాల్లో వేగంగా వ్యాపిస్తుండడంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఫ్రాన్స్‌లోనూ ఇప్పటికే కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాటికి 76 మంది వైరస్ బారినపడ్డారు. వందల మందికి లక్షణాలు ఉండడంతో క్వారంటైన్‌ చేశారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ మంత్రి వెరాన్ అత్యున్నత సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ పలకరింపుగా ముద్దులు ఇచ్చుకునే పద్ధతిని పక్కన పట్టాలని కోరారు. కరోనా బారినపడకుండా ఉండేదుకు దీనిపై పబ్లిక్ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఐదు వేల మందికి పైగా ఒకే చోటకి చేరే ఏ రకమైన సమావేశాలనూ నిర్వహించకూడదని వెరాన్ ఆదేశించారు. అన్ని రకాల పబ్లిక్ ఈవెంట్స్, కరోనా ఇప్పటికే వ్యాపించిన ప్రాంతాలకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు. ఈ ఆంక్షలు వెంటనే అమలులోకి వస్తాయన్నారు. దీంతో కేన్స్‌లో మార్చిలో జరగాల్సిన నాలుగు రోజుల ట్రేడ్ షో జూన్‌కి వాయిదా పడింది. అలాగే పారిస్‌లో ఆదివారం నిర్వహించాలనుకున్న హాఫ్ మారథాన్‌ను రద్దు చేశారు.