లక్షకు.. రెండు లక్షల సరుకులంటూ.. రూ.8 కోట్లు కుచ్చుటోపీ

లక్షకు.. రెండు లక్షల సరుకులంటూ.. రూ.8 కోట్లు కుచ్చుటోపీ
  • జోగులాంబ గద్వాల జిల్లాలో మోసం
  • ఏజెంట్లను నియమించుకొని డబ్బు వసూళ్లు

గద్వాల, వెలుగు: స్వచ్ఛంద సంస్థ పేరుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని నమ్మబలికి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌‌‌‌కు చెందిన ‘సెమ్ క్యాంటీన్’ సంస్థ ముందుగా ‘అన్నదాత’ పేరుతో కార్యక్రమాలు ప్రారంభించింది. స్పందన రాకపోవడంతో సెమ్ క్యాంటీన్ పేరుతో సంస్థలు ఏర్పాటు చేసి రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.2 లక్షల విలువైన సరుకులు 50 శాతం ఆఫర్‌‌‌‌పై ఇస్తామని ప్రచారం చేసింది. గ్రామాల్లో విలేజ్, మండల, జిల్లా స్థాయి ఆఫీసర్లను నియమించి నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేశారు. మొదట డీమార్ట్ నుంచి ఎక్స్‌‌‌‌పైరీ డేట్ దగ్గరలో ఉన్న వస్తువులను తక్కువ ధరకే ఇచ్చి నమ్మకం కలిగించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో షాపుల ప్రారంభాలు చేయించి ప్రచారం కూడా చేశారు.

తర్వాత ఫ్యాన్లు, కూలర్లు, పప్పులు, నూనె ప్యాకెట్లు వంటి నిత్యావసరాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని సరుకులు ఇవ్వలేదు. జిల్లాలో కొందరికి మాత్రమే సరుకులు ఇచ్చి వాటిని శాంపిల్‌‌‌‌గా చూపించి వందల మందిని ఆకర్షించారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష మొదలుకొని రూ.10 లక్షల వరకు డిపాజిట్లు తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోనే 300 నుంచి 400 మంది నిరుద్యోగుల నుంచి రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఏడాది నుంచి ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్ జిల్లాలో ఈ వ్యవహారం సాగినట్లు తెలుస్తోంది. డబ్బులు చెల్లించిన వారికి సరుకులు ఇవ్వకపోవడంతో బాధితులు సంస్థ ప్రతినిధులను నిలదీశారు. అయితే ఇటీవల సంస్థ ఐపీ నోటీసులు పంపడంతో మోసం బయటపడింది.