గొర్రెల పంపిణీ పథకంలో 600 యూనిట్ల గోల్‌ మాల్‌

గొర్రెల పంపిణీ పథకంలో 600 యూనిట్ల గోల్‌ మాల్‌

గొల్లకురుమల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం దళారుల చేతి వాటంతో పక్కదారి పడుతోంది . కొందరు ఆఫీసర్లు, దళారులు కుమ్మక్కై యూనిట్లకు యూనిట్లు మింగేస్తున్నారని గొర్రెల పెంపకం దారుల సంఘాలు ఆరోపిస్తున్నాయి . లబ్ధిదారులను ఇంతో అంతో ఇస్తామని మభ్యపెట్టి సంతకాలు తీసుకొని, ఫొటోలు తీసి గొర్రెలు లేకుండానే యూనిట్ల డబ్బులు కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో కరీంనగర్‌ జిల్లాలో గొర్రెల కొను ‘గోల్‌ మాల్‌ ’ జరిగినట్లు తెలుస్తోంది . గతజనవరి, ఫిబ్రవరి నెలల్లో కరీంనగర్‌ జిల్లాలో చేసిన గొర్రెల పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు సమాచారం.

ఆఫీసర్లు, దళారులు కుమ్మక్కై ఏకంగా 600 యూనిట్లకు పైగా గోల్​మాల్​చేసినట్లు సమాచారం. ఓ దళారి ఉన్నతాధికారులతో ములాఖత్‌‌ అయి అక్రమ వ్యాపారం కోసం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది . లబ్ధిదారులు చెల్లించిన రూ.31250కు రెట్టింపు చెల్లిస్తామని నమ్మబలికి వారికి డబ్బులు చెల్లించి గొర్రెలు తీసుకున్నట్లు సంతకాలు చేయించినట్లు తెలిసింది . గొర్రెలతో లబ్ధిదారుల ఫొటోలు తీయించి ఆన్‌ లైన్‌ లో పొందు పరచడంతో పాటు బీమా చెల్లింపులు కూడా చేసినట్లు సమాచారం. ఇలా దాదాపు 600 యూనిట్లకు చెందిన లబ్ధిదారులకు అందాల్సిన రూ.6కోట్లకుపైగా నిధుల కోసం రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. దీంతో పెట్టుబడి పెట్టిన సదరు దళారీ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూ నిధుల మంజూరుపై పలు మార్లు ఆరా తీయడంతో వ్యవహారం బయట పడినట్లు సమాచారం. ఈ విషయంపై ఫిర్యాదుల నేపథ్యంలో కరీంనగర్‌ కలెక్టర్‌ గత జనవరి, ఫిబ్రవరి నెలలో పంపిణీ చేసిన గొర్రెలపై ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలుస్తోంది . తీగలాగితే అక్రమాలు ఒక్కొ క్కటీ వెలుగు చూస్తున్నట్లు సమాచారం.

అక్రమాలపై స్పందించిన కలెక్టర్‌
ఫిర్యాదులు రావడంతో కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంపిణీ చేసిన గొర్రెల పంపిణీపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. కలెక్టర్‌ ఆదేశాలపై జిల్లా వెటర్నరీ ఆఫీసర్‌ (డీవీఏహెచ్‌‌వో) డాక్టర్‌ రాజన్న జిల్లా పరిధిలోని ఎంపీడీవోలకు ఫిబ్రవరి 25న లేఖ రాశారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వెరిఫికేషన్‌ పై ఒక ప్రొఫార్మా ప్రకారం ఎంపీడీవోలు 5శాతం, పంచాయితీరాజ్‌ ఈవోలకు 5శాతం వెరిఫికేషన్‌ చేయాలని బాధ్యతలు అప్పగించారు. విచారణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలినట్లు సమాచారం.

గొర్రెల పంపిణీ పథకం.. జరగాల్సిన ప్రక్రియ
గొల్ల, కురుమలకు ప్రభుత్వం 75శాతం సబ్సిడీతో రూ.1.25లక్షల విలువైన గొర్రెల పంపిణీ పథకం చేపట్టింది. ఈ పథకంలో ఒక్కో యూనిట్‌‌కు 20గొర్రెలు, ఒక విత్తన పొట్టేలు లబ్ధిదారులకు అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో యూనిట్‌‌ ధర రూ.లక్షా 25వేలుగా నిర్ణయించగా వీటిలో 25శాతం డబ్బులు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో 206 కిలోల దాణా కోసం రూ.3445, మిగతా బీమా, రవాణా కోసం కేటాయిస్తారు. రూల్స్​ప్రకారం మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకల నుంచి గొర్రెల కొనుగోలు చేయాల్సి ఉంటుంది . సెంట్రల్‌ ప్రొక్యూర్‌ మెంట్‌‌ టీమ్‌ ఆయా రాష్ట్రాల్లో ని ఫలానా ప్రాంతంలో కొను గోలు చేయడానికి గొర్రెలు ఉన్నాయని సమాచారం అంది స్తుంది . ఈ సమాచారం మేరకు వెటర్నరీ డాక్టర్‌ , లబ్ధిదారులతో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్లి గొర్రెల ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించి ధర నిర్ణయించి యూనిట్లను ఓకే చేస్తారు. అప్పుడు నిధుల కోసం ఆయా జిల్లాల డీవీఏహెచ్‌‌వో ఆఫీస్​కు సమాచారం అందిస్తారు. జిల్లా వెటర్నరీ ఆఫీసర్లు ఆర్టీజీఎస్‌ ద్వారా డబ్బు పంపిస్తారు. అప్పుడే ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల యూనిట్లును రాష్ట్రానికి రవాణా చేస్తారు.