ఇన్సూరెన్స్ పేరుతో మోసాలు..లెగ్జరి సైబర్ చీటర్ అరెస్ట్

ఇన్సూరెన్స్ పేరుతో మోసాలు..లెగ్జరి సైబర్ చీటర్ అరెస్ట్

హైదరాబాద్: ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో భారీ మోసాలు చేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్సూరెన్స్ పాలసీలు చేసి.. వాటి మెచ్యూరిటీ డబ్బులతో పాటు డబుల్ పాలసీలు ఇస్తామని నమ్మిస్తూ భాను ప్రతాప్‌ సింగ్‌ అనే వ్యక్తి చీటింగ్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కి చెందిన ఓ మహిళ నుండి 45 విడతలుగా రూ. 49.16 లక్షల మోసం చేశాడని.. ఆ మహిళ 2012 నుంచి రెండు బ్యాంకుల నుంచి ఆరు పాలసీలు తీసుకొని ఏడేండ్ల పాటు రెన్యువల్‌ చేస్తూ వచ్చిందన్నారు. 2019లో తాము ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని.. కంపెనీల పేరుపై రాసి ఉన్న పాలసీల క్లెయిమ్‌ లను మార్చుకోవాలని భాను ప్రతాప్‌ సింగ్‌ సూచించాడని.. ఇందుకు కొంత చార్జీలు చెల్లించాలని మొదలు పెట్టి రూ.50 లక్షలు కాజేశాడు. దీంతో బాధితురాలు సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఇన్స్‌పెక్టర్‌ గంగాధర్‌ టీమ్ దర్యాప్తు చేపట్టింది.

మంగళవారం ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి భాను ప్రతాప్‌సింగ్‌ ను అరెస్ట్‌ చేసి బుధవారం హైదరాబాద్ కి తరలించింది.  చీట్ చేసిన డబ్బులతో విలాసవంతమైన విదేశీ ట్రిప్ లతో ఎంజాయ్ చేసే వాడని.. భాను ప్రతాప్ సింగ్ అనే ఈ కేటుగాన్ని ఢిల్లీలో అరెస్ట్ చేశామని తెలిపారు. అతడి వద్ద నుంచి 20 తులాల బంగారంతో పాటు రూ. 3.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కోర్టులో హాజరుపరిచామని తెలిపారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.