ఇన్సూరెన్స్ పాలసీ.. మెచ్యూరిటీ పేరుతో మోసం

ఇన్సూరెన్స్ పాలసీ.. మెచ్యూరిటీ పేరుతో మోసం

హైదరాబాద్, వెలుగు: ఇన్సూరెన్స్‌‌‌‌ పేరుతో ఫోన్‌‌‌‌ చేసి మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ గ్యాంగ్​కి చెందిన కాల్‌‌‌‌ సెంటర్‌‌‌‌పై హైదరాబాద్‌‌‌‌ సిటీ సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ పోలీసులు దాడి చేశారు. నలుగురిని అరెస్ట్‌‌‌‌ చేసి 85 మంది టెలీ కాలర్స్‌‌‌‌కు 41(ఏ) నోటీసులు జారీ చేశారు. ఈ గ్యాంగ్ వివరాలను సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతితో కలిసి జాయింట్‌‌‌‌ సీపీ గజారావు భూపాల్‌‌‌‌ ఆదివారం మీడియాకు వెల్లడించారు. 

‘‘సిటీకి చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగికి.. తాము పీఎన్‌‌‌‌బీ మెటా లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌, భారతి ఎక్సా జనరల్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీల నుంచి మాట్లాతున్నామంటూ ఫోన్‌‌‌‌ చేశారు. మీ పాలసీ రెండేండ్లలోనే మెచ్యూరిటీ అవుతుందని, వెంటనే క్లెయిమ్ చేసుకుంటే రూ.1.70కోట్లు వస్తాయంటూ నమ్మించారు. అయితే, ముందుగా ఫీజు చెల్లించాలంటూ నమ్మించి పలు దఫాలుగా రూ.45,78,760 వసూలు చేశారు. దీనిపై బాధితురాలు సిటీ సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కస్టమర్‌‌‌‌ కేర్‌‌‌‌ ఫోన్ నంబర్స్, బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా దర్యాప్తు చేసి.. ముఠాను గుర్తించాం”అని జాయింట్ సీపీ వివరించారు.

ఢిల్లీ కేంద్రంగా ఫేక్ కాల్‌‌‌‌ సెంటర్‌‌‌‌

ఢిల్లీలో ‘‘హెచ్‌‌‌‌డబ్ల్యూ ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌’’ పేరుతో కాల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ నిర్వహిస్తున్నారు. ఇంటర్‌‌‌‌నెట్‌‌‌‌తో పాటు వివిధ మార్గాల నుంచి ఇన్సూరెన్స్‌‌‌‌ పాలసీలు ఉన్న వారి వివరాలు తీసుకుంటున్నారు. కస్టమర్స్​కు ఫోన్‌‌‌‌ చేసి కంపెనీ ప్రతినిధులుగా ఎలా నమ్మించాలనే అంశంపై ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ పొందిన టెలీ కాలర్స్‌‌‌‌కు రోజూ కొంత మంది పేర్లు ఇచ్చి వారికి ఫోన్లు చేయిస్తారు. కొన్ని సందర్భాల్లో బయటి నుంచి ఇన్సూరెన్స్‌‌‌‌ పాలసీ హోల్డర్ల డేటా టెలీ కాలర్స్‌‌‌‌కు అందిస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో పేరు, ఫోన్‌‌‌‌ నంబర్‌‌‌‌ ఆధారంగానే టెలీ కాలర్సే.. కస్టమర్లకు ఫోన్‌‌‌‌ చేసి స్వయంగా వారి నుంచే పాలసీల వివరాలు సేకరిస్తున్నారు.

పాలసీ మెచ్యూరిటీ తీరిందని..

పాలసీ మెచ్యూరిటీ దగ్గరగా ఉన్నవాళ్లకు ఇప్పుడే ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపుతారు. ఇంకా టైమ్ ఉన్నవారికి పాలసీ అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేయమంటారా.. అని ఫోన్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. ప్రభుత్వానికి చె ల్లించాల్సిన ఫీజులంటూ స్టాంప్‌‌‌‌ పేపర్స్‌‌‌‌, సెంట్రల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌, స్టేట్ ట్యాక్స్‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ ఫీ అంటూ రకరకాల పేర్లతో డబ్బులు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌‌‌‌ చేయించుకుంటారు.

రోజుకు దాదాపు 10 మంది ట్రాప్

ప్రతి రోజూ వంద మందికి ఫోన్లు చేస్తే అందులో 5 నుంచి 10 మంది వీళ్ల చేతికి చిక్కుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ నిర్వాహకులైన నలుగురు రమేంద్ర కుమార్‌‌‌‌ (కాల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ సీనియర్‌‌‌‌ మేనేజర్‌‌‌‌), సునీల్‌‌‌‌ (మేనేజర్‌‌‌‌), రిషబ్‌‌‌‌ తివారీ (అసిస్టెంట్‌‌‌‌ మేనేజర్‌‌‌‌), కవి ప్రకాశ్​(టీమ్‌‌‌‌ లీడర్‌‌‌‌)ను అరెస్ట్‌‌‌‌ చేశారు. మిగిలిన 85 మంది టెలీ కాలర్స్‌‌‌‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

నిందితుల నుంచి రెండు ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, 40 మొబైల్‌‌‌‌ ఫోన్లు, మూడు వాకీ టాకీలు, పలువురు కస్టమర్ల వివరాలున్న నోట్‌‌‌‌ బుక్స్‌‌‌‌, పాలసీ హోల్డర్ల డేటా షీట్స్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్‌‌‌‌ సీపీ వివరించారు.