ఆర్టీసీ బస్సుల్లో కొత్త తరహాలో సీటింగ్

ఆర్టీసీ బస్సుల్లో కొత్త తరహాలో సీటింగ్

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీతో  బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. బస్సుల్లో నిలబడటానికి కూడా చోటు ఉండటం లేదు. ఎక్కడ చూసినా బస్సులు ఫుల్ రష్ తో కినిపిస్తున్నాయి.  ఫ్రీ జర్నీ స్కీం ప్రవేశ పెట్టాక.. దాదాపు రోజుకు 20 లక్షల మంది ఫ్రీ జర్నీ చేస్తున్నారు. అయితే బస్సుల్లో ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా..ఎక్కువ మంది ప్రయాణించేందుకు ఆర్టీసీ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతోంది. బస్సులో కొన్ని సీట్లను  తొలగించి మెట్రో రైలులో మాదిరి సీటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా నిలబడి కూడా ఎక్కువ మంది వెళ్లొచ్చని భావిస్తున్నారు. 

అంతేగాకుండా కండక్టర్లు టికెట్లు ఇచ్చేటప్పుడు ఇబ్బంది అవుతోంది. ఫ్రీ టికెట్ ఇవ్వకపోతే వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు  మెట్రో తరహా సీటింగ్ సిస్టమ్  బెటరని ఆర్టీసీ అధికారులు  భావిస్తున్నారు.  ఇప్పటికే హైదరాబాద్ లోని కొన్ని రూట్ లో బస్సుల సీటింగ్ ను మార్చారు.

హైదరాబాద్ లోని  బస్సుల్లో ప్రస్తుతానికి 44 సీట్లు ఉన్నాయి. 63 మంది ప్రయాణిస్తే వంద శాతం ఆక్యుపెన్సీగా  ఆర్టీసీ చెబుతోంది.  ఇపుడు ఇందులో ఆరు సీట్లు తొలగిస్తున్నారు.  బస్సుకు ఇరు వైపుల మెట్రో మాదిరి 5 సీట్ల చొప్పును ఏర్పాటు చేస్తున్నారు.  ఇలా చేయడం వల్ల గతంలో పోలిస్తే రెండు సీట్లు తగ్గుతున్నాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.