మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సవరించాలి : విశారదన్ బహిరంగ లేఖ

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సవరించాలి : విశారదన్ బహిరంగ లేఖ
  • సీఎం రేవంత్ రెడ్డికి ధర్మసమాజ్ పార్టీ చీఫ్ విశారదన్ బహిరంగ లేఖ

ముషీరాబాద్, వెలుగు: మహాలక్ష్మి స్కీమ్​లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీకి నష్టం వస్తుందని ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌‌ విశారదన్ మహారాజ్ అన్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని సవరించాలని కోరారు.  ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి  పలు సూచనలతో రాసిన బహిరంగ లేఖను విశారదన్ మహారాజ్ మంగళవారం విడుదల చేశారు.  ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని తెల్లరేషన్ కార్డు ఉన్న పేద మహిళలకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. 

దీని వల్ల ఆర్టీసీకి సగం నష్టం తగ్గుతుందన్నారు.  లేదంటే భూస్వాములకు రైతుబంధు లబ్ధి చేకూర్చినట్లుగానే మహాలక్ష్మి పథకం ద్వారా ధనవంతులైన మహిళలు,  భారీ జీతాలు తీసుకునే వారికి లాభం ఉంటుందని ఆయన వివరించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు.  ఈ ఉచిత ప్రయాణ స్కీమ్​తో ఆటో కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు.  ప్రభుత్వం  వారిని ఆదుకోవాలన్నారు.