
ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్సు పథకం ప్రారంభానికి ముందు ప్రభుత్వానికి ఆటో యూనియన్ల నుంచి భారీ వ్యతిరేకత ఎదురైంది. ఫ్రీ బస్సు పథకం ఆటో కార్మికుల పట్ల శాపంగా మారిందని ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువ గళంలో మంత్రి నారా లోకేష్ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు యాప్ రద్దు చేసి, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ సీఐటీయు ఆధ్వర్యంలో తిరుపతి బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్ లో కార్మికులు మెడకు ఉరితాలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శులు ఎస్ జయచంద్ర, కేవేణుగోపాల్ మాట్లాడుతూ ఫ్రీ బస్సు పథకంలో భాగంగా మహిళల ఉచిత ప్రయాణానికి మేం వ్యతిరేకం కాదని, యూనియన్ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. చాలామంది డిగ్రీలు చదువుకుని ఉద్యోగాలు దొరక్క ఆటోను నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆటోడ్రైవర్లకు సంక్షేమ బాధ్యత తీసుకుంటానని నారా లోకేష్ హామీ ఇచ్చారని.. కానీ ఏడాది గడిచినా పట్టించుకోవటం లేదని అన్నారు.
త్రాగునీరు, టాయిలెట్ మౌలిక సదుపాయాలను కలిగిన ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తామని ప్రస్తుత మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని చెప్పారు. ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, ఆటో ఇన్సూరెన్స్ లు కలిపిస్తామని హామీ ఇచ్చారని.. పోలీసులు, ఆర్టీవో అధికారుల వేధింపులు లేకుండా చూస్తామని, పోలీసులకు ఆటో డ్రైవర్ల నుంచి చలాన్లు వసూలు చేయాలనే టార్గెట్ ఇవ్వమని ఆటో యూనియన్లను నమ్మించారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మందికి వాహన మిత్ర అమలు చేస్తామని, అదే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి, సబ్సిడీలో ఎలక్ట్రికల్ ఆటోలను ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా ఆటో కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదని అన్నారు. అదేవిధంగా ఓలా, ఉబర్, రాపిడో ఇతర ప్రైవేటు యాప్ లు ఆటో కార్మికుల సంపదను కొల్లగొట్టి నిలువున దోపిడీ చేస్తునన్నాయని మండిపడ్డారు. అందుకే ప్రభుత్వమే తమిళనాడు కేరళ రాష్ట్రంలో లాగా యాప్ ను నిర్వహించి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల పట్ల శాపంగా మారిన జీవో నెంబర్ 21 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మిక సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.