ట్రైనింగ్​ ఇస్తూ.. ఇన్​స్పైర్​ చేస్తూ..

ట్రైనింగ్​ ఇస్తూ.. ఇన్​స్పైర్​ చేస్తూ..

ఎన్నో ఆలోచనలు ఉన్న యువతకు సరైన గైడెన్స్​ లేకుండాపోతోంది. అద్భుతాలు సృష్టించగలిగే సత్తా ఉన్నవాళ్లు కూడా వెలుగులోకి రావడం లేదు. పెద్ద చదువులు చదివినా పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేని పరిస్థితి. ఇవన్నీ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడ్ని ఆలోచింపచేశాయి. అందుకే పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వాళ్లకు ఫ్రీ కోచింగ్​ ఇస్తున్నాడు.

ప్రదీప్​.. కేరళలోని కొల్లం ఎలక్ర్టిసిటీ బోర్డులో క్యాషియర్​. సరైన కోచింగ్​, ప్లానింగ్​ ఉంటే కానీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించని రోజులివి. కనీస వసతులు లేని చోట చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. చిన్నప్పట్నుంచే సోషల్​ సర్వీస్​ ఎక్కువ. జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్​ సబ్జెక్టుల్లో టాప్​లో ఉండేవాడు. ఇంటర్లోనే ‘యూపీఎస్​సీ’ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎలాంటి కోచింగ్​ తీసుకోకుండానే ‘యూపీఎస్​సీ’ ఎగ్జామ్స్​కి ప్రిపేర్​ అయ్యాడు. ప్రిలిమినరీలో పాసైనా, మెయిన్స్​లో ఫెయిల్​ అయ్యాడు. ఆ తర్వాత ‘కేరళ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​’ ఎగ్జామ్స్​కు ప్రిపేర్​ అయ్యాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ప్రిపరేషన్​కు అడ్డుగా మారాయి. ఎలాంటి ట్రైనింగ్​ తీసుకోకుండానే పన్నెండో ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్​ అయ్యాడు. టాలెంట్​ ఉండి కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని తెలుసుకున్నాడు. అందుకే సొంతూరిలోనే ‘పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​’ కోసం ఫ్రీ కోచింగ్​ సెంటర్​ను ప్రారంభించాడు. ‘కేవలం సొమ్ము చేసుకోవడం కోసమే కోచింగ్​ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. వేలల్లో ఫీజులు తీసుకుంటున్నా సరైన గైడెన్స్​ కూడా ఇవ్వడం లేదు. అందుకే ఫ్రీ కోచింగ్​ ఇస్తున్నా’ అంటాడు ప్రదీప్​. ఒకవైపు క్యాషియర్​గా పనిచేస్తూనే.. కోచింగ్​ సెంటర్​ను నడుపుతున్నాడు. ప్రదీప్​ దగ్గర ట్రైనింగ్​ తీసుకోవడం కోసం వేలల్లో స్టూడెంట్స్​ వస్తారు.

ఏడేళ్లుగా..

‘‘ఒకసారి పీఎస్సీకి ప్రిపేరయ్యే కొంతమంది విద్యార్థులను కలిశా. సరైన గైడెన్స్​ లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. దాంతో ఎలా ప్రిపేర్​ అవ్వాలో చెప్పా. ఎలా చదివితే స్కోర్​ చేయొచ్చు, కొద్దిపాటి సమయంలోనే పరీక్షలకు ఎలా ప్రిపేర్​ కావాలి, షార్ట్​కట్స్​, ఎగ్జామ్​ ప్యాటర్న్​.. ఇలా నాకు తెలిసిన ఎన్నో విషయాలను షేర్​ చేసుకున్నా. ఫలితంగా 2013 పీఎస్సీ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించారు. పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థుల సంఖ్య వేలకు చేరింది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో రెండు గ్రూపులుగా డివైడ్​ చేశా. ఇంటి టెర్రస్​ను క్లాస్​ రూంగా మార్చా. ఉదయం ఒక బ్యాచ్, సాయంత్రం మరో బ్యాచ్​కు ట్రైనింగ్​ ఇస్తా’ అని కోచింగ్​ గురించి వివరించాడు ప్రదీప్​.

ఏయే సబ్జెక్టుల్లో…

ప్రదీప్​ దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్లలో ఇప్పటివరకు ఏడు వందల మంది పీఎస్సీ సాధించారు. మరో నాలుగు వందల మంది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. మ్యాథ్స్​, ఇంగ్లీష్​, జనరల్​ నాలెడ్జ్​, కరెంట్​ అఫైర్స్​ సబ్జెక్టులు టీచ్​ చేస్తూ ఎంతో మందిని ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనవాళ్లంతా పాత మెటీరియల్స్​, నోటుబుక్స్​ ప్రదీప్​కు ఉచితంగా ఇస్తారు. కొత్తగా చేరబోయే స్టూడెంట్స్​కు ఆ మెటీరియల్​ అందించి, ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రదీప్​.

సాయం చేస్తారు

ప్రదీప్​ దగ్గర ట్రైన్​ అయ్యే విద్యార్థులంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. చదువుతోపాటు సేవ చేయాలనే ఆలోచనతో ఒక్కటయ్యారు. స్కూల్స్​ ఓపెనింగ్​ టైంలో పేద పిల్లలకు ఉచితంగా నోట్​బుక్స్​పంచడం, వరదల సమయంలో బాధితులకు సాయపడటం, అనాథ పిల్లలకు చేయూతనివ్వడం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ‘‘పదేళ్ల క్రితం నేను చదువుకునేటప్పుడు ఎలాంటి వసతులు ఉండేవి కావు. కోచింగ్​ కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అన్నీ వసతులున్నా.. సరైన కోచింగ్​ ఉండటం లేదు. అందుకే ఫ్రీ కోచింగ్​ సెంటర్​ నడుపుతున్నా’’ అన్నాడు .