- 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు
- సర్క్యూలర్ జారీ చేసిన సింగరేణి యాజమాన్యం
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి నడుపుతున్న స్కూళ్లలో ఇకపై కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకూ ఉచిత విద్య అందనుంది. 2026–-27 విద్యా సంవత్సరం నుంచి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ సౌకర్యాన్ని అమలు చేయనున్నట్లు యాజమాన్యం తాజాగా సర్క్యూలర్ జారీ చేసింది. ఈ మేరకు అన్ని స్కూళ్ల హెచ్ఎంలు, గనులు, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు ఆదేశాలు పంపింది. యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో సంస్థ వ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు భారీ ఊరట కలగనుంది.
కార్మిక సంఘాల డిమాండ్ మేరకు నిర్ణయం
సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 5 జిల్లాల్లో మొత్తం 9 స్కూళ్లను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు కేవలం పర్మినెంట్ కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు మాత్రమే పూర్తిస్థాయి ఉచిత విద్య అందేది. ఈ 9 బడుల్లో 5 స్కూళ్లు పాక్షికంగా ప్రభుత్వ గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద నడుస్తుండగా, మిగిలిన వాటిలో నాన్-సింగరేణియన్స్ (కాంట్రాక్ట్ కార్మికులు, స్థానికులు) పిల్లల నుంచి యాజమాన్యం నిర్ణయించిన నామమాత్రపు లేదా సాధారణ ట్యూషన్ ఫీజులు వసూలు చేసేవారు. కార్మిక సంఘాల డిమాండ్ నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు పూర్తిస్థాయి ఉచిత విద్యను అందించేందుకు యాజమాన్యం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సింగరేణి నడిపే పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల్లో మాత్రం స్థానికులు, ప్రాజెక్టు నిర్వాసితుల పిల్లలకు 50 శాతం సీట్లను కేటాయిస్తున్నారు.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఇవే..
ప్రస్తుతం సింగరేణి స్కూళ్లలో సుమారు 400 నుంచి 500 మంది కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలు చదువుకుంటున్నారు. 2026-–27 విద్యా సంవత్సరం నుంచి వీరందరితో పాటు కొత్తగా చేరే వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ వర్తించనుంది. ఈ సదుపాయం పొందేందుకు కాంట్రాక్ట్ కార్మికులు తమ గుర్తింపు కార్డు (ఐడీ), ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జిరాక్స్ లను సంబంధిత హెచ్ఓడీలకు అందజేయాలని యాజమాన్యం స్పష్టం చేసింది.
