గుడ్ న్యూస్: డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆదివాసీ విద్యార్థులకు ఉచిత విద్య

గుడ్ న్యూస్: డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆదివాసీ  విద్యార్థులకు ఉచిత విద్య

డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఆదివాసీ విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు ప్రకటించింది. ఆదివాసీలు ఇప్పటికీ వెనుకబాటుతోనే ఉన్నారని.. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో చదువుకు దూరమవుతున్నారని యూనివర్సిటీ  వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి అన్నారు. ఆదివాసీ అడవి బిడ్డలకు ఉచిత ఉన్నత విద్యను అందించనున్నట్లు శనివారం (ఆగస్టు 09) ప్రకటించారు. 

గడిచిన నాలుగు దశాబ్దాల్లో చదువుకు దూరమైన లక్షలాది మందికి అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉన్నత  విద్య అవకాశాలు చేరువ చేసిందన్నారు వీసీ ఘంటా చక్రపాణి. లక్షలాది మంది ఉన్నత విద్యను అభ్యసించినా వారిలో  ఎవరున్నారు అని కాకుండా ఏయే వర్గాల వారు లేరో విశ్వవిద్యాలయం పరిశోధించిందని తెలిపారు. పూర్తి స్థాయిలో గణాంకాలను విశ్లేషించుకుంటే  కొన్నివర్గాలు, తెగలు ఇంకా చదువుకు దూరంగా ఉన్నారనేది వెల్లడయిందని చెప్పారు. అందులో ముఖ్యంగా ఆదివాసీ తెగలు ఉన్నత విద్యలో అత్యంత వెనుకబడి ఉన్నారని విశ్వవిద్యాలయం గుర్తించి వారికీ  ఉన్నత విద్యను అందించాలని నిర్ణయించిందని తెలిపారు. 

డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బహుజన బడి అన్నారు వీసీ. 90 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు, అందులో సగం మహిళలు చదువుతున్న విశ్వవిద్యాలయం. అయినప్పటికీ వారిలో కొన్ని వర్గాల విద్యార్థులు తగినంత కనిపించలేదని.. తెలంగాణ లోని ఆదివాసీ తెగలు తగినంతగా ఉన్నత చదువుల్లోకి రాలేదని గమనించి వారికోసం ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకుని ముందుకు వచ్చిందని తెలిపారు.

Education at your doorstep అనేది విశ్వవిద్యాలయం నినాదం అని చెప్పారు ప్రొ. ఘంటా చక్రపాణి. దానికి అనుగుణంగా మారుమూల ప్రాంతాల్లో కూడా స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆదివాసీలకు చేరువకాలేక పోయామని విశ్వవిద్యాలయం గమనించిందని తెలిపారు. వారి  చదువుకు కావాల్సిన వనరులు సమకూర్చడానికి ప్రయత్నించాలని భావించినట్లు తెలిపారు. 

విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సులకు దేశంలోనే అత్యంత తక్కువ ఫీజు ఏడాదికి రూ. 3200  మాత్రమే వసూలు చేస్తున్నదని.. కానీ అడవి బిడ్డలకు అది కూడా భారమే, కాబట్టి వారికి ఫీజు లేకుండా చదువు చెప్పాలని భావించి “ఆదివాసీ ఉచిత విద్యా ప్రణాళిక” ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని గోండు, కోయ, చెంచు తదితర తెగల అడవిబిడ్డలకు అండగా నిలవడం, వారి నివాస ప్రాంతాలకు దగ్గరలో  ఎలాంటి బోధన రుసుము లేకుండా కేవలం 500 రూపాయల నామమాత్రపు అడ్మిషన్ ఫీజుతో ఉచితంగా చదువు చెప్పడం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ప్రవేశంతో పాటు, పుస్తకాలు, ఇతర దృశ్య శ్రవణ వనరులు వారికి సమకూర్చి రాబోయే ఐదేళ్ళలో కనీసం ఒక వెయ్యి మంది ఆదివాసీ పిల్లలను పట్టభద్రులుగా నిలబెట్టాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు  విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి వివరించారు.

ఆదివాసీ ఉచిత విద్యా ప్రణాళికలో చేరడానికి చివరి తేదీ ఆగష్టు 13 . పూర్తి వివరాలకు సంప్రదించగలరు :
📞 హెల్ప్ డెస్క్ : 040-23680333 / 040-23680555
📞 కాల్ సెంటర్ : 1800 5990 101 లేదా వెబ్ సైట్ : 
🌐 www.braou.ac.in | www.online.braou.ac.in