రేష‌న్ కార్డు లేక‌పోయినా.. 2 నెల‌లు వ‌ల‌స కార్మికుల‌కు ఫ్రీగా రేష‌న్

రేష‌న్ కార్డు లేక‌పోయినా.. 2 నెల‌లు వ‌ల‌స కార్మికుల‌కు ఫ్రీగా రేష‌న్

క‌రోనా లాక్ డౌన్ తో పట్టణ పేదలు, వలస కూలీలకు ఆక‌లి క‌ష్టం లేకుండా ఏర్పాట్లు చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో స‌హాయ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి భోజ‌న వ‌స‌తి క‌ల్పించేందుకు స్టేట్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి నిధులు వినియోగించుకునే వెసులుబాటు క‌ల్పించామ‌న్నారు. ఇందులో భాగంగా ఎస్డీఆర్ఎఫ్ కు రూ.11,200 కోట్ల నిధుల‌ను ఏప్రిల్ 3న విడుద‌ల చేశామ‌న్నారు. ఆత్మ నిర్భ‌ర భార‌త్ ప్యాకేజీలో భాగంగా రెండో పార్ట్ ను గురువారం సాయంత్రం వెల్ల‌డించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్. ఇందులో భాగంగా రైతులు, వ‌ల‌స కూలీలు, చిన్న వ్యాపారుల‌కు సంబంధించిన అంశాల‌ను వెల్ల‌డించారు.

8 కోట్ల మంది వ‌ల‌స కూలీల‌కు ఉచిత రేష‌న్

వ‌ల‌స కార్మికులు ఆక‌లితో అల‌మ‌టించ‌కూడ‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం వారంద‌రికీ ఉచిత రేష‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు నిర్మ‌లా సీతారామ‌న్. వారికి రేష‌న్ కార్డులు ఉన్నా లేకున్నా నెల‌కు ప్ర‌తి వ్య‌క్తికి ఐదు కిలోల బియ్యం లేదా గోదుమ‌లు, కుటుంబానికి ఒక‌ కిలో పప్పు ఫ్రీగా మ‌రో రెండు నెల‌ల పాటు అందిస్తామ‌న్నారు. దీని ద్వారా 8 కోట్ల మంది వ‌ల‌స కూలీల‌కు ల‌బ్ధి పొందుతార‌ని, ఇందుకోసం ఖ‌ర్చ‌య్యే రూ.3500 కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని చెప్పారు.

ఉపాధి హామీ ప‌థ‌కం ద్వారా ప‌నులు

ల‌క్ష‌లాది మంది వ‌ల‌స కూలీలు శ్రామిక్ స్పెష‌ల్ ట్రైన్ల ద్వారా వారి స్వ‌స్థ‌లాల‌కు చేరుకుంటున్నార‌ని, వారి ఉపాధి హామీ ప‌థ‌కం ద్వారా ప‌ని క‌ల్పిస్తామని చెప్పారు నిర్మ‌లా సీతారామన్. వారంతా ఈ స్కీమ్ లో న‌మోదు చేసుకునేందుకు ప్ర‌త్యేక డ్రైవ్స్ నిర్వ‌హిస్తామ‌న్నారు. అలాగే నిలిచిపోయిన రాష్ట్రాల్లోనూ పేరు న‌మోదు చేసుకుని ఉపాధి పొందొచ్చ‌న్నారు. వ‌ర్షాకాలంలోనూ ఉపాధి హామీ ప‌నుల‌ను కొన‌సాగిస్తామ‌ని చెప్పారు.