కొన్ని మండలాలకే వేరుశనగ విత్తనాలు

 కొన్ని మండలాలకే  వేరుశనగ విత్తనాలు
  • వనపర్తి జిల్లాలో 3 మండలాల్లో  సీడ్స్​ పంపిణీ చేస్తున్నట్లు ఆఫీసర్ల వెల్లడి

వనపర్తి, వెలుగు:నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్​ మిషన్​ ఆన్​ ఎడిబుల్​ ఆయిల్​ సీడ్స్(ఆయిల్​ సీడ్​ కార్పొరేషన్) స్కీమ్​ కింద ఎంపిక చేసిన రైతులకు వేరుశనగ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. అయితే విత్తనాల పంపిణీ కొన్ని మండలాలకే పరిమితం చేయడం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు.

 ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగ సాగుకు వనపర్తి జిల్లా ప్రసిద్ధి. ఇక్కడ పండించిన వేరుశనగకు ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్​ ఎక్కువ. విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పండించిన వేరుశనగలో అఫ్లాటాక్సిన్​ అనే శిలీంద్రం లేకపోవడంతోనే డిమాండ్​ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కానీ, వివిధ కారణాలతో గత కొన్నేండ్లుగా జిల్లాలో వేరుశనగ సాగు తగ్గుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్  మిషన్​ ఆన్​ ఎడిబుల్​ ఆయిల్​ సీడ్స్  స్కీమ్​ కింద విత్తనాలు ఉచితంగా అందించి వేరుశనగ సాగును ప్రోత్సహిస్తోంది. 

3,895 ఎకరాలకు ఉచిత విత్తనాలు..

వనపర్తి జిల్లాలో రబీ సీజన్​లో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 22వేల ఎకరాలు కాగా, 10 వేల ఎకరాలు కూడా సాగవడం లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈక్రమంలో జిల్లాలో నేషనల్​ మిషన్​ ఆన్​ ఎడిబుల్​ ఆయిల్​ సీడ్స్  స్కీమ్ కింద వనపర్తి, పాన్​గల్​ క్లస్టర్ల పరిధిలోని మూడు మండలాల ను ఎంపిక చేశారు. పాన్​గల్​లో 1,395 ఎకరాలు, పెద్దమందడి, పెబ్బేరు మండలాలకు కలిపి 2,500 ఎకరాలకు ఉచిత విత్తనాలను పంపిణీ చేయాలని లక్ష్మంగా పెట్టుకున్నారు. 

పాన్​గల్​లో 1,256 క్వింటాళ్లు, పెబ్బేరులో 490, పెద్దమందడిలో 690 క్వింటాళ్ల చొప్పున విత్తనాలను రైతులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు సన్న, చిన్నకారు, ఎస్సీ, ఎస్టీ రైతులను ఎంపిక చేసి ఒక్కో రైతుకు ఒక హెక్టారుకు అవసరమైన వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు.

కొత్త రకం వంగడం..

జిల్లాలో ఎక్కువగా కె-6 రకం వేరుశనగ వంగడాన్ని సాగు చేస్తున్నారు. తాజాగా ఆయిల్​ సీడ్​ కార్పొరేషన్​ అందించే నూనె గింజ రకం సీడ్​ కేఎల్ (కదిరి లేపాక్షి)గా ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఈ సీడ్​ నూనె ఉత్పత్తికి ఉపయోగకరంగా ఉంటుందని, తినడానికి పెద్దగా ఉపయోగపడదని చెబుతున్నారు. రైతులకు మామూలు వేరుశనగ కన్నా, ఈ రకం పంట సాగుతో మంచి లాభాలు వస్తాయని, దీనిని ప్రోత్సహించేందుకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు అధికారులు అంటున్నారు. 

ఒక ఎకరానికి 90 కిలోల విత్తనాలు సరిపోతాయని చెబుతున్నారు. ఈ రకం పంటను సాగు చేసేందుకు ముందుకు వచ్చిన రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది సాగు చేసిన రైతులు మంచి దిగుబడులు సాధిస్తే భవిష్యత్తులో జిల్లాలో పెద్ద మొత్తంలో వేరుశనగ సాగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలాఉంటే జిల్లాలోని అన్ని ప్రాంతాల రైతులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు పంపిణీ చేసి వేరుశనగ సాగును ప్రోత్సహించాలని కోరుతున్నారు. 

నూనె గింజల ఉత్పత్తే లక్ష్యం..

నూనె గింజల ఉత్పత్తే లక్ష్యంగా నేషనల్​ మిషన్​ ఆన్​ ఎడిబుల్​ ఆయిల్​ సీడ్​ స్కీమ్​ అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ఎంపిక చేసిన పాన్​గల్, పెబ్బేరు, పెద్దమందడి మండలాల్లో విత్తనాలు పంపిణీ చేశాం. ఈ రకం వేరుశనగ సాగుతో రైతులు అధిక లాభాలు వస్తాయి.  -ప్రభాకర్​రెడ్డి, ఏడీఏ, వనపర్తి