మేడారంలో పస్రా నుంచి గద్దెల వరకు  ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

మేడారంలో పస్రా నుంచి గద్దెల వరకు  ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

 ఇందుకోసం 
30 మినీ బస్సులు కేటాయింపు  ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర కోసం ఈసారి ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పస్రా నుంచి గద్దెల వరకు ఫ్రీ సర్వీసులు అందించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ప్రకటించారు. ప్రైవేట్‌‌ వెహికల్స్‌‌లో వచ్చిన భక్తులు పస్రా పరిసరాల్లోని పార్కింగ్‌‌ ప్లేస్‌‌ల్లో తమ వెహికల్స్​ను పార్క్‌‌ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి గద్దెల వరకు సుమారు 7 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ దూరానికి టికెట్‌‌ లేకుండా ఫ్రీగా ప్రయాణికులను ఆర్టీసీ తరలించనుంది. ఇందుకోసం సంస్థ 30 మినీ బస్సులను ఉపయోగించనుంది.

మేడారం విత్ టీఎస్ ఆర్టీసీ యాప్​

ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారిగా ‘మేడారం విత్‌‌  ఆర్టీసీ’ పేరుతో యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో అన్ని రకాల సమాచారం పొందుపరిచారు. మేడారం జాతర హిస్టరీ మొత్తంలో ఇందులో ఉంటుంది. అంతే కాకుండా మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్న టూరిస్ట్‌‌ ప్లేస్‌‌లను వివరించారు. ఎక్కడి నుంచి ఎంత దూరం.. ఎంత ఛార్జీలు.. ఎక్కడి నుంచి బస్సులు ఉన్నాయి.. ఎన్ని గంటలకు ఉన్నాయి..తదితర వివరాలు ఉంటాయి. ఇందులో టికెట్‌‌ కూడా బుక్‌‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. మేడారానికి ఎట్ల పోవాలో జీపీఎస్‌‌ రూట్‌‌ మ్యాప్‌‌ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంచారు. 

జాతరను రెవెన్యూగా చూడట్లేదు: సజ్జనార్​

మేడారం జాతరకు ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ చెప్పారు. శుక్రవారం ఆయన బస్​భవన్​లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జాతరను రెవెన్యూగా చూడటంలేదు. సామాజిక బాధ్యత, సేవగా భావిస్తున్నం. ప్రజా రవాణాను ప్రోత్సహించాలి. గద్దె దగ్గరకు తొందరగా వెళ్లాలంటే ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేయాలి” అని సూచించారు. మేడారం డ్యూటీ చేసే అందరికీ బూస్టర్‌‌ డోసు వేయిస్తామని, త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ చెల్లిస్తామని తెలిపారు. ఈ నెల నుంచి మెకానిక్‌‌లకు ఇన్సెంటివ్స్‌‌ ఇస్తామని,  త్వరలోనే బస్సులను జీపీఎస్‌‌ సిస్టం తీసుకొస్తామని చెప్పారు.