కలెక్టర్ ఆఫీసుల ఫ్రీ భోజనం

కలెక్టర్ ఆఫీసుల ఫ్రీ భోజనం

కరీంనగర్: ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఉచిత భోజనం అందిస్తున్నారు. అన్నపూర్ణ క్యాంటిన్ పథకం కింద దాదాపు ప్రతి సోమవారం 120 నుంచి 150 మంది దాకా ఫ్రీ మిల్స్ ఇస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టరేట్ కు వచ్చే జనం ఆకలి తీరుతోంది. 

ఆకలితో ఉన్న వారికి సమయానికి పెట్టే భోజనం అమృతంతో సమానమంటారు. కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణికి బాధలు చెప్పుకునేందుకు జనం భారీగా వస్తుంటారు. ఉదయం ఎప్పుడో ఇంటి నుంచి బయలుదేరి వచ్చి.. తమ సమస్యలపై కలెక్టర్ కు, అధికారులకు దరఖాస్తులు ఇచ్చి వెళ్తుంటారు. ప్రజావాణికి వచ్చే వారిలో ఎక్కువమంది నిరుపేదలే ఉంటారు. రైతుల సమస్యలు తీర్చాలని.., పేదలు దళితబంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు కావాలని దరఖాస్తులు ఇచ్చి వెళ్తుంటారు. 

ఇలాంటి వారు బయటి హోటళ్లలోనో, మెస్ లోనో భోజనం చేయడం వారికి తలకు మించిన భారమవుతుంది. దీంతో చాలామంది ఆకలితో వచ్చి.. ఆకలితోనే ఇంటికి వెళ్తుంటారు. ఇది గమనించిన అధికారులు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉచిత భోజనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ కళాభారతి దగ్గర అన్నపూర్ణ పథకం కింద 5 రూపాయలకిచ్చే భోజనంలో కొంత కలెక్టరేటు ప్రాంగణానికి తెచ్చి.. కొన్ని వారాలుగా ఉచితంగా అందిస్తున్నారు.

కరీంనగర్ కలెక్టరేట్ మేయిన్ గేటు దగ్గర ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే జనం కోసం ఉచిత భోజనం అందిస్తారు. ఇందులో అన్నం, సాంబారు, కొంచెం స్వీటు, ఓ కర్రీ ఇస్తుంటారు. దీంతో ప్రజావాణికి వచ్చి ఆకలితో బాధపడే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది.ఆకలితో ఉన్న వారికి సమయానికి భోజనం పెట్టాలన్న ఆలోచన వచ్చిన అధికారులను జనం అభినందిస్తున్నారు. మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఈ ఉచిత భోజనంతో తమ ఆకలి తీర్చుకుంటున్నారు.

ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ఈ ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. చాలా మంది ఆకలితో వచ్చినవాళ్లు.. ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నారు. ప్రతి సోమవారం 120 నుంచి 150 మంది దాకా ఇక్కడ భోజనం చేస్తుంటారని.. వడ్డించే వ్యక్తి చెబుతున్నారు. అయితే భోజనం చేసే దగ్గర బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు.. మరికొన్ని వసతులు కల్పిస్తే బాగుంటుందన్నారు స్థానికులు.  ప్రజావాణి తరహాలో మిగతా ఆఫీసుల దగ్గర వివిధ గ్రామాల నుంచి వచ్చే వారికి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసి ఆకలి తీర్చాలంటున్నారు జనం. అధికారుల నిర్ణయం కరీంనగర్ లో ప్రశంసలు అందుకుంటోంది.