యాట కూర.. కోటర్​ సీసా

యాట కూర.. కోటర్​ సీసా
  • దసరా రోజు ఓటర్లకు పంచేందుకు లీడర్ల ప్లాన్
  • ఇప్పటికే పెద్ద సంఖ్యలో మేకల కొనుగోళ్లు

హైదరాబాద్, వెలుగు : దసరా పండుగ వచ్చిందంటే చాలు.. చాలా ఇండ్లలో ముక్క, చుక్క కంపల్సరీగా మారిపోయింది. పండుగ గడ్వాల్నంటే ఎంతలేదన్నా నాలుగైదు వేల రూపాయల దాకా ఖర్చయితది. అయితే, ఈసారి ఎన్నికల వల్ల గుట్టుచప్పుడు కాకుండా ఇంటికే ఫ్రీగా మటన్​, మందు రానున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు చాలా నియోజకవర్గాల్లో లీడర్లు ఈ ప్లాన్​ వేశారు. ఇంటిల్లిపాదికి సరిపోయే దసరా పండుగ ఖర్చంతా తామే భరిస్తామని, ముఖ్యంగా యాటకూర, లిక్కర్​ పంపిస్తామని తమ అనుచరుల ద్వారా ఓటర్లకు సమాచారం చేరవేస్తున్నారు.

పంపిణీ బాధ్యతలను గ్రామ స్థాయి ముఖ్య కార్యకర్తలకు అప్పజెప్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల లీడర్లు పెద్ద సంఖ్యలో మేకలు, గొర్రెలు కొని పెట్టుకున్నారు. దసరాకు ముందు రోజు రాత్రి నుంచి యాటలు తెగేలా, తెల్లారే సరికి  ఓటర్ల ఇంటికి యాటకూర​ చేరేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

నియోజకవర్గంలోని ఊర్లు ఎన్ని, ఊరిలో కుటుంబాలు ఎన్ని, తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లు ఎంత మంది, ప్రతికూలంగా ఉన్న ఓటర్లు ఎంత మంది, న్యూట్రల్​గా ఉన్న ఓటర్లు ఎంతమంది, వారందరికీ మటన్​, మందు చేరాలంటే ఎంత ఖర్చవుతుంది.. అనే లెక్కలను లీడర్లు ముందే వేసుకున్నారు. దసరా రోజు ఇంటికి కిలోకు తక్కువ కాకుండా మటన్​ పంచేందుకు కొందరు లీడర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకొందరు లీడర్లు మటన్​కు ఖర్చు ఎక్కువవుతుందని భావించి.. దాని బదులు చికెన్​ పంపించేందుకు సిద్ధమవుతున్నట్లు ఊర్లలో టాక్​ వినిపిస్తున్నది.

మార్కెట్​లో కిలో మటన్​ రూ. 600 నుంచి 800 దాకా పలుకుతున్నది. అదే కిలో చికెన్​ దాదాపు రూ. 200 పలుకుతున్నది. ఒకటీ రెండు బీర్లు, లేదంటే కోటర్​, ఆఫ్​ బాటిల్​ లిక్కర్​ను ఇంటికే పంపేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందు కోసం కొందరు లీడర్లు స్టాక్​ను తెప్పించి పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది.  ‘మందు, మటన్​ మీకు.. మీ ఓట్లన్నీ మాకు’ అనే తీరుగా కొన్ని నియోజకవర్గాల్లో లీడర్లు జనం ముందుకు వెళ్తున్నారు. పండుగ వేళ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 

వినాయక చవితి నుంచే తాయిలాలు షురూ

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతి పండుగను లీడర్లు తమకు అవకాశంగా మలుచుకుంటున్నారు. పండుగకు ఎంత ఖర్చయినా భరించి, ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ట్రెండ్​ వినాయక చవితి నుంచే మొదలైంది. సాధ్యమైన మేర వినాయక విగ్రహాలను కొనివ్వడమో, విరాళంగా భారీ మొత్తాన్ని ఇవ్వడమో చేస్తూ వచ్చారు.

ఆయా మండపాల వద్దకు వెళ్లి పూజలు చేసి, ఎన్నికల బరిలో తాము ఉన్నామనే విషయాన్ని జనాలకు గుర్తు చేసి వచ్చారు. కొందరు వినాయక మండపాల కరెంటు బిల్లులను కూడా చెల్లించారు. ఇప్పడు దసరా కావడంతో మందు, మటన్ పంచడం, దసరా వేడుకలను నిర్వహించడం ద్వారా జనాలకు దగ్గరయ్యేందుకు లీడర్లు ప్రయత్నిస్తున్నారు.