దివ్యాంగులకు షరతులు లేకుండా రేషన్ కార్డులు

దివ్యాంగులకు షరతులు లేకుండా రేషన్ కార్డులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రధాన మంత్రి గరీబ్‌‌‌‌ కల్యా ణ్‌‌‌‌ యోజన (పీఎంజీకేఏవై) కింద మరో ఆరు నెలలు అదనపు రేషన్‌‌‌‌ను ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా10 కిలోల బియ్యం ఇచ్చేందుకు సిద్ధం అయింది. మంగళవారం నుంచి ఇచ్చే ఈ నెల రేషన్‌‌‌‌లో ఈ ఉచిత బియ్యాన్ని అందించేందుకు సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఏర్పాట్లు చేసింది.  

ఆగస్టులో 15 కిలోల బియ్యం

మే నెల నుంచే పీఎంజీకేఏవై కింద ఫ్రీ రేషన్‌‌‌‌ ఇవ్వాల్సి ఉండగా, రాష్ట్ర సర్కారు అమలు చేయలేదు. అయితే, జూన్‌‌‌‌ 20 నుంచి అదనపు కోటా బియ్యాన్ని ఇవ్వడం ప్రారంభించింది. దీంతో మే నెలలో ఇవ్వాల్సిన అదనపు కోటాను ఆగస్టు నెలకు అడ్జెస్ట్‌‌‌‌ చేసుకుని, మొత్తం 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. అలాగే, పోషక విలువలు ఉండే పోర్టిఫైడ్‌‌‌‌ బియ్యాన్ని అందించే కుమ్రంభీమ్‌‌‌‌ ఆసిఫాబాద్‌‌‌‌, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాల్లో అదనపు కోటా బియ్యం.. సాధారణ బియ్యంతో పంపిణీ చేయనున్నారు. 

ఎఫ్‌‌‌‌సీఐ కొర్రీతో దిగివచ్చిన రాష్ట్ర సర్కారు

పీఎంజీకేఏవై కింద ఉచితంగా అదనపు కోటా అమలు చేస్తే రూ.70 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడుతుందని పంపిణీని ఆపేసింది. కానీ, సెంట్రల్‌‌‌‌ పూల్‌‌‌‌ నుంచి కేంద్రం అందించే అదనపు కోటాను మే, జూన్‌‌‌‌ నెలల పంపిణీ కోసం ఎఫ్‌‌‌‌సీఐ నుంచి 1.90 లక్షల టన్నుల బియ్యాన్ని సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంది. మే నెలలో పూర్తిగా అదనపు కోటా ఉచిత బియ్యం అమలు చేయకపోగా, జూన్‌‌‌‌ ప్రారంభంలోనూ రూపాయికి కిలో బియ్యాన్నే ఇచ్చింది. దీంతో రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌పై ఎఫ్‌‌‌‌సీఐ సీరియస్‌‌‌‌ అయింది. ఈ క్రమంలో ఎఫ్‌‌‌‌సీఐ రాష్ట్రం నుంచి కస్టమ్‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌ రైస్‌‌‌‌(సీఎంఆర్‌‌‌‌)ను తీసుకోవడాన్ని నిలిపివేస్తున్నామని జూన్‌‌‌‌ 7న ప్రకటించింది. గత 27 రోజులుగా ఎఫ్‌‌‌‌సీఐ సేకరణ నిలిచిపోవడంతో రాష్ట్రంలో వడ్ల మిల్లింగ్‌‌‌‌ ఆగిపోయింది. 5 కిలోల బియ్యం ఎగ్గొడదామనుకుంటే మొదటికే మోసం వచ్చేలా ఉందని గ్రహించిన రాష్ట్ర సర్కారు.. దిద్దుబాటు చర్యలకు దిగింది. 

దివ్యాంగులకు షరతులు లేకుండా రేషన్ కార్డులు

అంగవైకల్యం 40 శాతానికి పైగా ఉన్న దివ్యాంగులకు ఎలాంటి షరతులు లేకుండా రేషన్‌‌‌‌ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి కుటుంబంలో ఎంతమంది ఉన్నా..ఆదాయ పరిమితులను మినహాయించి రేషన్‌‌‌‌ కార్డులివ్వనున్నారు.