18 ఏండ్లు పైబడినోళ్లందరికీ ఏపీలో ఫ్రీ వ్యాక్సిన్

18 ఏండ్లు పైబడినోళ్లందరికీ ఏపీలో ఫ్రీ వ్యాక్సిన్

18 ఏండ్లు పైబడినోళ్లకు వ్యాక్సిన్ ఏపీలో ఉచితం 
రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తామన్న జగన్ సర్కారు

 

అమరావతి: కరోనా కేసులు పెరుగుతున్నందున ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏండ్లు పైబడినోళ్లకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌‌ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ప్రజలకు ఫ్రీగా వ్యాక్సిన్‌‌ ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఏపీలో 18 నుంచి 45 ఏళ్ల వయసున్నవాళ్లు సుమారు 2,04,70,364 మంది ఉన్నారని అధికారులు అంచనా వేశారు. శుక్రవారం ఏపీ హెల్త్ మినిస్టర్ ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడిపై సీఎం జగన్ అధ్యక్షతన మీటింగ్ జరిగిందని.. వైరస్ ను కంట్రోల్ చేసేందుకు  ప్రజల భాగస్వామ్యంతోపాటు వాక్సినేషన్ కూడా ముఖ్యమని సీఎం చెప్పారన్నారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. 18 నుంచి- 45 ఏండ్ల వయసు ఉన్న వారికి ఉచితంగా టీకాలు వేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీని కోసం రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తామన్నారు.

నేటి నుంచి నైట్ కర్ఫ్యూ
ఏపీలో శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తామని ఆ రాష్ట్ర మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.