
- ఆరో ర్యాంకర్ ఆండ్రీవాకు వైల్డ్ కార్డ్ ప్లేయర్ బాయిసన్ షాక్
పారిస్: వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ జానిక్ సినర్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. మెగా టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ ఇటలీ స్టార్ సినర్ 6–1, 7–5, 6–0తో అలెగ్జాండర్ బబ్లిక్ (కజకిస్తాన్)ను వరుస సెట్లలో చిత్తు చేశాడు. 1 గంటా 49 నిమిషాల్లోనే ముగిసిన వన్‌సైడ్ పోరులో రెండో సెట్‌లో మాత్రమే బబ్లిక్ నుంచి సినర్‌కు కాస్త ప్రతిఘటన ఎదురైంది. మిగిలిన రెండు సెట్లలో ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయిన సినర్.. అలవోకగా గెలిచాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లు చెరో ఐదు ఏస్‌లు కొట్టారు. బలమైన సర్వీస్‌లతో ఆకట్టుకున్న జానిక్ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించగా.. బబ్లిక్ ఒక్కటి కూడా నెగ్గలేకపోయాడు.
మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 6–0, 6–1, 6–4తో 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా)ను వరుస సెట్లలో ఓడించాడు. మరోవైపు విమెన్స్ సింగిల్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన వైల్డ్ కార్డ్ ప్లేయర్ లోయిస్ బాయిసన్ సంచలనం సృష్టించింది. క్వార్టర్ ఫైనల్లో 7-–6 (8/6), 6–-3 తో ఆరో ర్యాంకర్ మిరా ఆండ్రీవా (రష్యా)ను ఓడించి సెమీస్ చేరుకుంది. ఫ్యాన్స్ సపోర్ట్ మధ్య అద్భుతంగా ఆడిన లోకల్ప్లేయర్ లోయిస్ తొలి సెట్‌ను టై బ్రేక్ నెగ్గింది. రెండో సెట్‌లో మరింత ఆధిపత్యం చూపెట్టింది. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–7 (8/6), 6–4, 6–1తో తోటి ప్లేయర్ మాడిసన్ కీస్‌పై మూడు సెట్ల పాటు కష్టపడి గెలిచింది. గురువారం జరిగే సెమీస్‌లో బాయిసన్‌తో గాఫ్, సబలెంకాతో స్వైటెక్ పోటీపడతారు.