సాత్విక్‌ జోడీ సంచలనం

సాత్విక్‌ జోడీ సంచలనం
  • వరల్డ్‌‌ చాంపియన్స్‌‌ను ఓడించి క్వార్టర్స్‌‌కు
  • సింధు, సైనా కూడా  

పారిస్‌‌:   తెలుగు ఆటగాడు, డబుల్స్‌‌ స్టార్‌‌ షట్లర్‌‌ సాత్విక్‌‌ సాయిరాజ్‌‌ మరోసారి సంచలనం సృష్టించాడు. చిరాగ్‌‌ షెట్టితో కలిసి ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో బరిలోకి దిగిన అతను వరల్డ్‌‌ చాంపియన్‌‌ జోడీకి షాకిచ్చి క్వార్టర్‌‌ఫైనల్లో అడుగుపెట్టాడు. ఈ యువ జోడీతో పాటు మహిళల సింగిల్స్‌‌లో  పీవీ సింధు, సైనా నెహ్వాల్‌‌ కూడా ముందంజ వేశారు.

గురువారం జరిగిన పురుషుల డబుల్స్​ సెకండ్‌‌ రౌండ్‌‌లో 11 ర్యాంకర్‌‌ సాత్విక్‌‌–చిరాగ్‌‌ జంట 21–18, 18–21, 21–13తో  ప్రపంచ రెండో ర్యాంక్‌‌ జోడీ మహమ్మద్‌‌ ఎహసన్‌‌–హెండ్రా సెతైవన్‌‌ (ఇండోనేసియా)ను ఓడించి ఔరా అనిపించింది.  ఆగస్టులో జరిగిన థాయ్‌‌లాండ్‌‌ ఓపెన్‌‌ గెలిచి తొలి సూపర్‌‌ 500 టైటిల్‌‌ ఖాతాలో వేసుకున్న ఇండియా జంట 2013, 2015, 2019లో మూడు సార్లు వరల్డ్‌‌ చాంపియన్‌‌గా నిలిచిన ప్రత్యర్థిపై అద్భుత ఆటతీరు కనబరిచింది.  53 నిమిషాల పాటు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో ఫస్ట్‌‌ గేమ్‌‌లో బ్రేక్‌‌ టైమ్‌‌కు 11–7తో ఆధిక్యం సాధించింది. వరుసగా ఐదు పాయింట్లు గెలిచిన ఇండోనేసియా జంట 16–14తో లీడ్‌‌లోకి వచ్చినా అద్భుతంగా ఆడిన ఇండియా జోడీ  గేమ్‌‌ నెగ్గి పైచేయి సాధించింది.

సెకండ్‌‌ గేమ్‌‌ గెలిచి మ్యాచ్‌‌లో నిలిచిన ఎహసన్‌‌–హెండ్రా జంట మూడో గేమ్‌‌లో 10–5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్రేక్‌‌ టైమ్‌‌కు 9–11తో నిలిచిన ఇండియా జంట విరామం తర్వాత ఒక్కసారిగా రెచ్చిపోయింది. వరుస పాయింట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసి  మ్యాచ్‌‌ గెలిచింది. క్వార్టర్స్‌‌లో  టాప్‌‌ సీడ్‌‌ కిమ్‌‌ అస్ట్రప్‌‌–స్కారప్‌‌ జంటతో పోటీ పడనుంది. కాగా, మహిళల సింగిల్స్‌‌ సెకండ్‌‌ రౌండ్‌‌లో ఐదో సీడ్‌‌ పీవీ సింధు 21–10, 21–13తో  యెవొ జియా మిన్‌‌ (సింగపూర్‌‌)పై ఈజీగా గెలిచింది. మరో మ్యాచ్‌‌లో తొమ్మిదో సీడ్‌‌ సైనా నెహ్వాల్‌‌ 21–10, 21–11తో డెన్మార్క్‌‌ షట్లర్‌‌ లిన్‌‌ హొజ్‌‌మార్క్‌‌ను చిత్తుగా ఓడించి క్వార్టర్స్‌‌లో అడుగుపెట్టింది. కాగా, పురుషుల సింగిల్స్‌‌ సెకండ్‌‌ రౌండ్‌‌లో  శుభాంకర్‌‌ డే 6–21, 13–21తో హిరెన్‌‌ షెరర్‌‌ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. దాంతో ఈ విభాగంలో ఇండియా పోరాటం ముగిసింది.

French Open: Saina, Sindhu, Satwiksairaj-Chirag through to quarters in Paris