
హైదరాబాద్: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఇంద్రజాల విద్య ద్వారా మూఢ నమ్మకాల నుంచి ప్రజలను జాగృతం చేయడంలో పట్టాభిరామ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. తన ఇంద్రజాల విద్య ద్వారా అనేక ప్రజాపయోగ కార్యక్రమాలు చేసిన పట్టాభిరామ్ లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. పట్టాభిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ALSO READ | ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
కాగా, తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితులైన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాభి రామ్ గుండెపోటుతో కన్నుమూశారు. జూన్ 30న రాత్రి 9 గంటల 45 నిమిషాలకు ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేవలం వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాకుండా హిప్నటిజంలో కూడా ఆయన దిట్ట. మెజీషియన్గా కూడా సుపరిచితులు. మోటివేషనల్ స్పీకర్గా ప్రసంగాలు మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలనే అంశంపై ఆయన పలు పుస్తకాలు కూడా రాశారు.
వేల మందిని.. మరీ ముఖ్యంగా విద్యార్థులను తన ప్రసంగాలతో, పుస్తకాలతో మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు పట్టాభి రామ్ కృషి చేశారు. దాదాపు 20 సంవత్సరాలకు పైగా మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా గౌరవప్రదంగా కొనసాగారు. ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఖైరతాబాద్ లోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. జులై 2న మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. వ్యక్తిత్వ వికాస రంగంలో ఆయన సేవలకు గానూ ఎన్నో అవార్డులు, రివార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.