
- 29 న రాష్ట్ర కేబినెట్ సమావేశం
- 30 నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ?
- ఎమ్మెల్యేలకు కాళేశ్వరం రిపోర్టు కాపీలు
- నివేదికపైనే ప్రధానంగా చర్చ..
- ఇవాళ మళ్లీ ఫాంహౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్, హరీశ్ భేటీ
- నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్న బీఆర్ఎస్ లీడర్లు
హైదరాబాద్: గులాబీ శిబిరంలో కాళేశ్వరం టెన్షన్ నెలకొంది. కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సర్కారు సిద్ధమవుతోంది. 600 పేజీలతో కూడిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతోపాటు ఎమ్మెల్యేలకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో డిజైనింగ్, ఇంజినీరింగ్ లోపాలపై కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు కేబినెట్ లో తీర్మానించనున్నారు. ఇందుకోసం ఈ నెల 29న కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. బడ్జెట్ సమావేశాల తర్వాత శాసనసభను ప్రోరోగ్ చేశారు. ఆ తర్వాత కేబినెట్ లో బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఇచ్చారు. అసెంబ్లీ సెషన్ నిర్వహించేందుకు గవర్నర్ నుంచి అనుమతి పొందనున్నారు. మరుసటి రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తారని తెలుస్తోంది.
ఈ సమావేశాల్లో మొదటి రోజున ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు మొదటి రోజు సభలో సంతాపం ప్రకటించనున్నారని సమాచారం. ఉప సభాపతి ఎన్నిక కూడా ఇదే సెషన్ లో ఉండనుంది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు ఆవశ్యకత.. నిర్మాణ, డిజైనింగ్ లోపాలపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నివేదికలో ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్లు ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ఇందులో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా, హరీశ్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్లిద్దరూ హౌస్ సభ్యులు. ఈటల రాజేందర్ ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు. హైకోర్టులో చుక్కెదురైన తర్వాత మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తరుచూ మాజీ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ఫాంహౌస్ వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కూడా ఫాంహౌస్ కు వెళ్లి భేటీ అయ్యారు. అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెడితే అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చిస్తున్నారని సమాచారం.