
కరీంనగర్: ఎంపీగా ఉన్నంత కాలం సైకిళ్ల పంపిణీ కొనసాగిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. సీఎస్ఆర్ నిధులతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 20 వేల సైకిళ్ల పంపిణీ చేపట్టిన బండి సంజయ్.. ఇందులో భాగంగా మంగళవారం (ఆగస్ట్ 26) మానకొండూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు ఓట్లేసింది ఓటర్లే.. కానీ ఓటేయించింది మాత్రం పిల్లలేనని అన్నారు. పిల్లల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేస్తున్నానని తెలిపారు. సైకిళ్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గుతున్నాయని.. విద్యార్థులు రెగ్యులర్‌గా క్లాసులకు హాజరవుతున్నారని అన్నారు. త్వరలోనే 9వ తరగతి విద్యార్థులకు కూడా సైకిళ్లు అందిస్తానని చెప్పారు.
పేదరికం ఎంత దారుణంగా ఉంటుందో నాకు తెలుసని.. తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చినవాడినేనని అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో పిల్లల బాధలు కళ్లారా చూశానని గుర్తు చేసుకున్నారు. ఎల్‌కేజీ నుంచి 6వ తరగతి వరకు ‘మోడీ కిట్స్’ అందిస్తామన్నారు. ఓట్ల కోసం, పేరు కోసం సైకిళ్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. లక్ష్యాన్ని ఎంచుకోండి.. తలదించుకుని చదవండి.. తలెత్తుకునే స్థాయికి చేరుకోండని విద్యార్థులకు సూచించారు.