
సినీ నటి వాసుకి ( పాకీజా )కి ఆర్థిక సాయం అందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకీజా.. తనను ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు వీడియో ద్వారా విన్నవించుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో పాకీజా దీనస్థితికి చలించిన పవన్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. పవన్ కళ్యాణ్ తరఫున శాసనమండలి ప్రభుత్వ విప్ హరిప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సదరు మొత్తాన్ని అందజేశారు. మంగళగిరిలో జనసేన ఆఫీసుకు పాకీజాను పిలిపించి సొమ్మును అందజేశారు.
ALSO READ | NTRNeel: ఎన్టీఆర్-నీల్ మూవీ.. కోటిన్నర డిమాండ్ చేసిన కన్నడ హీరోయిన్!
పవన్ కళ్యాణ్ చేసిన ఆర్థిక సాయానికి కృతఙ్ఞతలు తెలిపారు పాకీజా. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కళ్ళు మొక్కుతానంటూ భావోద్వేగానికి గురయ్యారు పాకీజా. తన వీడియోకు తక్షణమే స్పందించి ఆర్థిక సాయం అందించినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు పాకీజా. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ గతంలో కూడా తనను ఆడుకున్నారని.. మెగాఫ్యామిలీకి ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు పాకీజా.
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కామెడీ పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్థానం క్రియేట్ చేసుకుంది పాకీజా. అయితే.. ఇప్పుడు అవకాశాలు కరువై తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది పాకీజా. పాకీజా దీనస్థితి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచింది. తనకు మళ్ళీ నటించాలని ఉందని.. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నానని... తనను ఆదుకోవాలని కోరింది పాకీజా. మొత్తానికి పాకీజా దీనస్థితికి స్పందించిన పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.