నోయిడా మళ్లీ రగులుకుంది. అధికారుల జోక్యం, ప్రభుత్వ చర్చలతో ఆందోళనలు చల్లారినట్లు కనబడినా.. తెల్లారే సరికి మళ్లీ భగ్గుమంది. ఉద్యోగుల జీతాలు, భద్రత మొదలైన అంశాలపై వెల్లువెత్తిన నిరసనలు ఏప్రిల్ 13న నోయిడా నుంచి ఢిల్లీ, ఫరీదాబాద్ తదితర ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో చర్చల పేరున కొంత శాంతించినా.. ఏప్రిల్ 14న మళ్లీ రోడ్లపైకెక్కారు కార్మికులు.
కనీస హక్కుల కోసం నోయిడా కార్మికవాడలోని ఫేజ్ 2 లో వర్కర్లు గత వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనలు సోమవారం (ఏప్రిల్ 13) హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ వాహనలు, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టారు కార్మికులు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగం చేయడంతో పోలీసులపై రాళ్లు రువ్వడంతో రణరంగం అయ్యింది.
మంగళవారం (ఏప్రిల్ 14) నోయిడాలోని సెక్టార్ 80 లో.. తక్కువ జీతాలకు నిరసనగా మళ్లీ రోడ్లపైకెక్కారు. పోలీసులపై రాళ్లు రువ్వుతుండటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసేందుకు ప్రయత్నించారు.
కనీసం 20 వేల రూపాయలకు తగ్గకుండా కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆందోళనలు చేస్తున్నారు. జీతాల పెంపు ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని పోలీసులు కార్మికులతో మాట్లాడుతున్న సమయంలోనే కార్మికులు రెచ్చిపోవడంతో హింసాత్మకంగా మారింది. పరిస్థితులను అడ్వాంటేజ్ గా తీసుకుని లబ్ది పొందాలని కార్మికుల వెనుక కొందరు కుట్రలు చేస్తున్నారని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.
- జీతం పెంచాల్సి వస్తుందని డిస్మిస్ చేసి మళ్లీ తీసుకుంటున్నారు:
అంతకు ముందు అహూజ ఫ్యాక్టరీ కార్మికులు.. కంపెనీ యూనిట్ బయట ఆందోళకు దిగారు. ఇటీవల పెంచిన జీతాలపై సంతృప్తికరంగా లేమని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేట్లను కంపెనీ గేట్లకు అంటించాలని డిమాండ్ చేశారు. అలోవెన్సెస్, బోనస్ లు ఇవ్వటం లేదని, ఎక్కువ పని చేయించుకున్నా ఓటీ చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. 9 నెలల తర్వాత ఉద్యోగిని డిస్మిస్ చేసి.. మళ్లీ అదే శాలరీకి రిక్రూట్ చేసుకుంటున్నారని ఆరోపించారు. జీతం పెంచకుండా ఉండాలనే కుట్రతో ఎంప్లాయ్స్ ని డిస్మిస్ చేసి మళ్లీ రిక్రూట్ చేసుకునే కుట్రలకు పాల్పడుత్నట్లు ఆరోపిస్తున్నారు.
అప్రెంటిషిప్ సమయంలో ఇస్తున్న జీతాలపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట గంటకు 90 రూపాయల చొప్పున ఇచ్చేవారని.. దాన్ని రూ.50 కి తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు.
నోయిడా ఆందోళనలో మొత్తం 45 వేల ఉద్యోగులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. మొత్తం 80 సెక్టార్ల నుంచి ఉద్యోగులు రోడ్లపైకొచ్చారు. సెక్టార్ 63 ఏరియాలో మదర్ సన్ కంపెనీ పరిసరాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
- పాక్ హస్తం ఉంది: లేబర్ మినిస్టర్
నోయిడా ఆందోళనల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఉత్తరప్రదేశ్ లేబర్ మినిస్టరర్ర అనిల్ రాజ్ భర్ ఆరోపించారు. ఇది పక్కా ప్రణాళికలతో చేసిన కుట్రగా పేర్కొన్నారు. పాక్ కుట్ర ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆందోళనలో ఇప్పటి వరకు పోలీసులు 350 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

