
నారాయణగూడ, వెలుగు: కుమార్తె స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడి తల్లిని చేసిన ప్రబుద్ధుడిపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గడియగౌరారం గ్రామానికి చెందిన హలీం మేకర్ మహమూద్ షరీఫ్ కుటుంబం గతంలో బొగ్గులకుంటలో ఉండేది. ప్రస్తుతం బండ్లగూడ ఆనంద్ నగర్ లో ఉంటున్నారు. బొగ్గులకుంటలో ఉన్నపుడు అతని కుమారై స్నేహితురాలు అప్పుడప్పుడు ఇంటికి వచ్చేది. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి షరీఫ్అత్యాచారం చేశాడు.
విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు షరీఫ్ ను నిలదియ్యగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలోనే బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు షరీఫ్ పై ఒత్తిడి పెంచడంతో షరీఫ్ సోదరుడు మహమూద్ చంద్ బాధిత కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితులు షరీఫ్ పై ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసును నారాయణగూడ పీఎస్ కు బదిలీ చేశారు. నారాయణగూడ పోలీసులు షరీఫ్, చంద్ లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.