మోసకారిని పట్టించిన చీర

మోసకారిని పట్టించిన చీర

చిత్రకూట రాజ్యంలోని  ధర్మవరం అనే గ్రామంలో వెంకటయ్య, రమణయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్లిద్దరూ వస్త్ర వ్యాపారంలో మంచి పేరు సంపాదించారు. వెంకటయ్య చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, నిజాయితీపరుడు. రమణయ్య మాత్రం దురుసు స్వభావం కలవాడు, మోసకారి. ప్రతిరోజు ఇద్దరూ బట్టల మూటలను నెత్తి మీద  పెట్టుకుని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి వ్యాపారం చేస్తుంటారు. ప్రతిరోజు సాయంత్రం ఇద్దరూ ఒక దగ్గర కలుసుకొని తిరిగి ఇంటికి వెళ్తుంటారు.

రమణయ్య మాయమాటలతో ఎక్కువ ధరలకు మూడవ వంతు బట్టలు అమ్మేసేవాడు డబ్బులు బాగా మిగిలేవి‌‌. వెంకటయ్య మాత్రం తను తీసుకెళ్లిన బట్టల్లో కేవలం పావు వంతు మాత్రమే అమ్మే వాడు. మిగిలిన ముప్పావు అలానే  ఇంటికి తీసుకెళ్ళేవాడు? చాలా తక్కువ డబ్బు సంపాదించే వాడు. ఆ సంపాదన ఇంటికి సరిపోయేది కాదు.

‘‘నువ్వెలా అమ్మగలుగుతున్నావు? నేను ఎందుకు అమ్మలేకపోతున్నాను?” అని ఒకరోజు రమణయ్యను అడిగాడు వెంకటయ్య. దానికి రమణయ్య ‘‘మనం అమ్మేటప్పుడు లేనిపోని అబద్ధాలు.  మాయమాటలు చెప్తేనే మన సరుకంతా అమ్ముడవుతుంది. అలా కాకుండా నిజాయితీగా ఉంటే మన సరుకును ఎవరూ  కొనరు. మనల్ని పట్టించుకోరు” అన్నాడు . 

“అలా చేయడం తప్పు కదా. ఉన్న విషయం ఉన్నట్టు చెప్తే దానికి ఇష్టపడినవాళ్లే మన దగ్గర కొంటారు. లేని పోని అబద్ధాలు చెప్పి సరుకులు అమ్మడం మంచి పద్ధతి కాదు.  నేను అలా ఎప్పటికీ చేయను” అన్నాడు వెంకటయ్య. తర్వాత ఇద్దరూ ఇంటిదారి పట్టారు.

ఒకరోజు ఆ రాజ్యాన్ని పాలించే  రాజు మహిపాలుడికి ఎక్కువ మొత్తంలో చీరల అవసరం వచ్చింది. అందుకు కారణం మహారాణి మంగళ గౌరీ వ్రతం చేసి సుమారు నూరు మంది మహిళలకి చీరలు ఇవ్వాలి అనుకుంది. అందుకని చీరలు ఎక్కువగా ఎవరు నేయగలరో తెలుసుకుని, వాళ్లకి వస్త్రాల తయారీకి కావాల్సిన ముడి సరుకు ఇవ్వమని చెప్పాడు. ఎవరైతే మంచి చీరలు తయారు చేసిస్తారో వాళ్లకి ఆస్థానంలో కొలువు కూడా వస్తుందని దండోరా వేయించమని మంత్రిని ఆజ్ఞాపించాడు మహారాజు. చీరలు నేసేందుకు వెంకటయ్య, రమణయ్య తో పాటు చాలామంది వెళ్లారు. కానీ, పది రోజుల్లోనే అన్ని చీరలు నేసి ఇవ్వాలన్నారు. దాంతో  అందరూ వెనక్కి తగ్గితే ఈ ఇద్దరు మిత్రులే చివరకు మిగిలారు. దాంతో మహామంత్రి ‘‘సరే అయితే ఈ సరుకు తీసుకెళ్లండి. చీరలు నేసి పది రోజుల తర్వాత తీసుకొచ్చి అప్పజెప్పండి. అయితే నేనిచ్చిన ముడి పదార్థాలకు వరుస నెంబర్లు ఉన్నాయి. మీరు నేత నేసేటప్పుడు ఆ లెక్క ప్రకారమే వరుస క్రమంలో ముడి పదార్థాలు వాడాలి’’ అని చెప్పాడు మంత్రి. ‘సరే’ అని ముడి సరుకులు తీసుకుని ఇంటి దారి పట్టారు ఇద్దరూ.

పది రోజులు గడిచాక ‘‘మీరు నేసిన చీరలను తీసుకుని రాజు గారు రమ్మంటున్నారు” అంటూ భటులు కబురు తెచ్చారు. తాము తయారుచేసిన చీరలు మూట కట్టుకొని బయల్దేరారు ఇద్దరూ. ఆస్థానానికి చేరుకున్న తర్వాత వాళ్లు తయారుచేసిన చీరల మూటలు తీసి మహారాజు గారి ముందు ఉంచారు. రకరకాల రంగుల్లో ఉన్న చీరలను చూసి  ఆనందించాడు  మహారాజు. ముందుగా వెంకటయ్య మాట్లాడుతూ ‘‘మహారాజా  మీరిచ్చిన ముడిపదార్ధంతో తయారైన చీరలు 60” అన్నాడు. ఆ  తరువాత రమణయ్య ‘‘మహారాజా! మీరిచ్చిన ముడిపదార్ధంతో నేను  తయారుచేసిన చీరలు  నలభై’’ అని లెక్క చెప్పాడు. 

‘‘అదేమిటి మీ ఇద్దరికీ ఒకే రకమైన ముడి పదార్థం ఇచ్చినప్పుడు నీ దగ్గర తక్కువ చీరలు వచ్చాయేంటి?’’ అని మంత్రి అడిగాడు. ‘‘మీరు ఇచ్చిన ముడి పదార్థం నీళ్లలో తడిపి తయారుచేయడం వల్ల దారపు పోగులు ముడుచుకు పోయాయి. దాంతో పొడవు తగ్గి తక్కువ చీరలు వచ్చాయి” అన్నాడు రమణయ్య. వెంకటయ్య నేసిన చీరల్లో ఒక చీర పూర్తిగా విప్పి వెలుతురులో చూస్తే మధ్యలో ‘చిత్రకూట’ అనే పేరు అస్పష్టంగా కనిపించింది. దాదాపు ప్రతి చీరలోను అది ఉంది. అదిచూసిన మంత్రి వెంకటయ్య మనం ఇచ్చిన వరుస క్రమంలోనే ముడి పదార్థాన్ని వాడి చీరలు నేసాడు అని మనసులో అనుకున్నాడు. తర్వాత రమణయ్య  నేసిన చీరలను విడదీసి చూశాడు. అందులో ఎక్కడా చిత్రకూట పేరు కనిపించలేదు. అంటే ఇతను మనం ఇచ్చినటువంటి  ముడి సరుకు అంతా వాడలేదు. కొంత సరుకు పక్కన పెట్టడం వల్ల చీరల సంఖ్య తగ్గిందన్నమాట. అదొక్కటే కాకుండా వరుస క్రమం కూడా తప్పడం వల్ల పేరు కూడా రాలేదని గమనించాడు.అదే విషయాన్ని మంత్రి రాజుతో చెప్పాడు. మంత్రి మాటలు విన్న రమణయ్యకు ముచ్చెమటలు పట్టడం మొదలైంది. మహారాజు వెంటనే ‘‘రమణయ్యను బంధించండి” అని భటులను  ఆజ్ఞాపించాడు. 

‘‘మహారాజా... మహారాజా...నన్ను  క్షమించండి. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా చేశా. ఇక ఎప్పుడూ ఇటువంటి పని చెయ్యను” అని  వేడుకున్నాడు. ‘‘రమణయ్యా! నువ్వు చాలా మందిని మోసం చేస్తున్నావని నీ మీద ఎన్నోసార్లు ఫిర్యాదులు వచ్చాయి. అసలు నీ విషయాన్ని తెలుసుకుందామనే నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశా. నీ మోసకారి బుద్ధి బయటపడింది. తక్షణం ఇతన్ని బంధించి చెరసాలలో  వేయండి” అన్నాడు మహారాజు. తను చేసిన పనికి తగిన శాస్తి జరిగిందని బాధపడటం తప్ప ఇంకేమీ చేయలేక అక్కడినుంచి కదిలాడు రమణయ్య. వెంకటయ్య నిజాయితీని అభినందిస్తూ అతన్ని ఘనంగా సత్కరించి ఆస్థానంలో కొలువు ఇచ్చాడు మహారాజు. నిజాయితీని నమ్ముకుంటే  ఎప్పటికైనా కచ్చితంగా మంచే జరుగుతుంది.

- ఏడుకొండలు కళ్ళేపల్లి