జీఎస్టీ పరిహార నిధులు.. 542 కోట్లు విడుదల

జీఎస్టీ పరిహార నిధులు.. 542 కోట్లు విడుదల

న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి బ్యాలెన్స్ ఉన్న రూ.542 కోట్ల జీఎస్టీ పరిహార నిధుల్ని కేంద్రం విడుదల చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్​కు రూ.682 కోట్లు రిలీజ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార నిధులు రూ.17 వేల కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను ఇప్పటివరకు రాష్ట్రాలు, యూటీలకు రూ. 1,15,662 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. 

ఈ ఏడాది అక్టోబర్ వరకు సెస్ వసూళ్ల రూపంలో రూ.72,147 కోట్లు రాగా, బ్యాలెన్స్ రూ. 43,515 కోట్లను కేంద్రం తన బడ్జెట్​ నుంచి రిలీజ్ చేసిందని తెలిపింది.  ఇదే సంవత్సరం మే నెలలో ఫిబ్రవరి– మే కాలానికి సంబంధించి రూ. 86,912 కోట్లను ప్రొవిజినల్ జీఎస్టీ పరిహారం కింద రిలీజ్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.